ఏడేళ్ల విరామం తర్వాత... | Hockey India League to start again | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల విరామం తర్వాత...

Oct 5 2024 4:05 AM | Updated on Oct 5 2024 4:05 AM

Hockey India League to start again

తిరిగి ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్‌

న్యూఢిల్లీ: ఏడేళ్ల విరామం తర్వాత హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) తిరిగి అభిమానుల మందుకు రానుంది. 2013లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన హెచ్‌ఐఎల్‌ ఐదు సీజన్‌ల తర్వాత 2017లో నిలిచిపోయింది. హకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడిగా దిలీప్‌ టిర్కీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ లీగ్‌ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేయగా... ఎట్టకేలకు శుక్రవారం దీనికి ఆమోద ముద్ర లభించింది. 

ఈ ఏడాది డిసెంబర్‌ 28న ప్రారంభం కానున్న ఈ లీగ్‌ సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించనుంది. గతంలో పురుషుల విభాగంలో మాత్రమే పోటీలు జరగగా... ఇప్పుడు మహిళల విభాగంలోనూ నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో 8 జట్లు (చెన్నై, లక్నో, పంజాబ్, కోల్‌కతా, ఢిల్లీ, ఒడిశా, రాంచీ, హైదరాబాద్‌)... మహిళల విభాగంలో 6 జట్లు (పంజాబ్, కోల్‌కతా, ఢిల్లీ, ఒడిశా, మరో 2 జట్లను ప్రకటించాలి) పోటీపడతాయి. 

పురుషుల మ్యాచ్‌లను రౌర్కెలాలో, మహిళల పోటీలను రాంచీలో నిర్వహించనున్నారు. మహిళల లీగ్‌ ఫైనల్‌ వచ్చే ఏడాది జనవరి 26న, పురుషుల తుదిపోరు ఫిబ్రవరి 1న జరగనుంది. లీగ్‌ కోసం ఈ నెల 13 నుంచి 15 వరకు ప్లేయర్ల వేలం జరగనుంది. మూడు కేటగిరీల్లో (రూ. 10 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు) ప్లేయర్లను విభజించారు. ఒక్కో జట్టులో 24 మంది ప్లేయర్లు ఉండనున్నారు. 

అందులో కనీసం 16 మంది భారత ఆటగాళ్లు, 8 మంది విదేశీయులకు అవకాశం ఉంటుంది. భారత ఆటగాళ్లలో నలుగురు జూనియర్లు తప్పనిసరి అనే నిబంధనను తీసుకొచ్చారు. ఈ లీగ్‌తో దేశంలో మహిళల హాకీకి మరింత ఆదరణ దక్కుతుందని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2017లో చివరిసారి జరిగిన హాకీ ఇండియా లీగ్‌లో కళింగ లాన్సర్స్‌ జట్టు విజేతగా నిలిచింది.   

Advertisement
 
Advertisement
Advertisement