’అదంతా మీడియా, సోషల్‌ మీడియా సృష్టే’ | Tirkey wants me to play 500 games: Manpreet dismisses fallout rumours | Sakshi
Sakshi News home page

’అదంతా మీడియా, సోషల్‌ మీడియా సృష్టే’

Mar 28 2026 4:28 PM | Updated on Mar 28 2026 5:01 PM

Tirkey wants me to play 500 games: Manpreet dismisses fallout rumours

న్యూఢిల్లీ: హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీతో ఎలాంటి విబేధాలు లేవని... వెటరన్‌ మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ వెల్లడించాడు. భారత్‌ తరఫున టిర్కీ అత్యధికంగా 412 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా... ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు మన్‌ప్రీత్‌ సింగ్‌ సిద్ధంగా ఉన్నాడు. 

ఇప్పటి వరకు మన్‌ప్రీత్‌ కెరీర్‌లో 411 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ ప్రాబబుల్స్‌ నుంచి మన్‌ప్రీత్‌ పేరును తొలగించడంతో... ఇద్దరి మధ్య అనుబంధం సరిగ్గా లేదనే పుకార్లు వినిపించగా... మన్‌ప్రీత్‌ వాటిని కొట్టేశాడు. 

‘ఆసియా క్రీడల వరకు ఆడాలనుకుంటున్నా. ప్రస్తుతం నా దృష్టి అంతా దానిపైనే ఉంది. అందుకోసం తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ను బట్టి కెరీర్‌ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటా. దిలీప్‌ టిర్కీతో వ్యక్తిగతంగా మాట్లాడా. ఆయన పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడితే సంతోషిస్తా అని ప్రోత్సహించారు. 

మా మధ్య చక్కటి అనుబంధం ఉంది. 500 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలవాలని ఆకాంక్షించారు’ అని మన్‌ప్రీత్‌ వెల్లడించాడు. మరోవైపు టిర్కీ స్పందిస్తూ... ‘అదంతా మీడియా, సోషల్‌ మీడియా సృష్టే. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు’ అని అన్నాడు.

కాగా 2020, 2024 ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యుడైన మన్‌ప్రీత్‌... ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో మూడేసి పతకాలు సొంతం చేసుకున్నాడు. శుక్రవారం నిర్వహించిన హాకీ ఇండియా వార్షిక అవార్డుల కార్యక్రమంలో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నందుకుగాను మన్‌ప్రీత్‌ ప్రత్యేక బహుమతిని తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు కొండా విజయ్‌ కుమార్‌ చేతుల మీదుగా అందుకున్నాడు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement