Bizarre Run Out: ఏంటి ఇలా జరిగిపోయింది?

Heather Knight Bizarre Run Out In IND W Vs ENG W 2nd T20I - Sakshi

గెలిచి నిలిచిన భారత మహిళలు 

రెండో టి20లో ఇంగ్లండ్‌పై విజయం 

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ వివాదాస్పద రనౌట్‌?!

హోవ్‌: ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ జట్టుతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత టీమిండియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్‌ షఫాలీ వర్మ (48; 8 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడింది. కేథరిన్‌ బ్రంట్‌ వేసిన నాలుగో ఓవర్‌లో షఫాలీ వరుసగా ఐదు ఫోర్లు కొట్టింది.  హర్మన్‌ప్రీత్‌  (31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (24 నాటౌట్‌; 1 ఫోర్‌)లు రాణించారు. ఛేదనలో ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసి ఓడింది. ఓపెనర్‌ బీమాంట్‌ (59; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇంగ్లండ్‌ విజయానికి చివరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా... 5 రన్స్‌ మాత్రమే చేసి ఓడింది. కీలకమైన బీమాంట్‌ వికెట్‌ను తీసి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పిన దీప్తి శర్మ (1/18)కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

వివాదాస్పద రనౌట్‌?
రెండో టీ20 సందర్భంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హెదర్‌ నైట్‌ రనౌట్‌ అయిన తీరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీప్తి శర్మ బౌలింగ్‌లో 14 ఓవర్‌ చివరి బంతిని ఎదుర్కొన్న జోన్స్‌... స్ట్రెయిట్‌ షాట్‌ ఆడింది. అయితే, పరుగు కోసం నైట్‌ అప్పటికే క్రీజును వీడగా... బాల్‌ దీప్తి కాళ్ల నడుమ స్టెప్‌ తిని స్టంప్స్‌ను తాకింది. ఈ క్రమంలో దీప్తి సంబరాలు చేసుకోగా.. ఊహించని పరిణామానికి కంగుతిన్న నైట్‌.. షాక్‌కు గురైంది. అంపైర్‌ దీనిని రనౌట్‌గా ప్రకటించడంతో నిరాశగా పెవిలియన్‌కు చేరింది.

ఈ విషయంపై స్పందించిన మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ అలెక్స్‌ హర్ట్‌లీ.. ‘‘కావాలనే బ్యాట్స్‌వుమెన్‌ను అడ్డుకున్నట్లు కదా’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక మార్క్‌ బచర్‌ మాట్లాడుతూ.. ‘‘బౌలర్‌ ఉద్దేశపూర్వంగా హెదర్‌ నైట్‌ను అడ్డుకోనట్లయితే ఇది కచ్చితంగా అవుట్‌ అన్నట్లే కదా?’’ అని పేర్కొన్నారు. కాగా ఐసీసీ నిబంధనల్లోని 41.5 రూల్‌ ప్రకారం.. మాటల ద్వారా గానీ, చేతల ద్వారా గానీ.. ఉద్దేశపూర్వంగా బ్యాటర్‌ను బౌలర్‌ అడ్డుకుంటే శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై అంపైర్‌ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ‘‘ఇలా కూడా రనౌట్‌ చేస్తారా? విచిత్రంగా ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top