
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణ ఆట తీరుతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గతంలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే ఈసారి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా పయనిస్తోంది.
ఇప్పటికి ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఏకంగా ఏడు ఓడిపోయి అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది. ఐదుసార్లు ట్రోఫీ గెలవడంతో పాటు.. అనేకసార్లు ఫైనల్ చేరిన జట్టుగా ఘనత ఉన్న సీఎస్‌కేకు ఇలాంటి దుస్థితి ఇదే తొలిసారి.
ఇక ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన తర్వాత చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం వల్ల మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) మరోసారి సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టాడు.
కాగా వికెట్ కీపర్‌గా ఇప్పటికీ మెరుపు వేగంతో పాదరసంలా కదిలి స్టంపింగ్‌లు చేస్తున్న ధోని.. బ్యాటర్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. 43 ఏళ్ల ఈ వెటరన్ క్రికెటర్ ఐపీఎల్-2025లో తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని కేవలం 140 పరుగులే చేశాడు.
సీఎస్‌కే భవిష్యత్తు బాగుండాలంటే
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్, ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ అయిన ఆడం గిల్‌క్రిస్ట్ ధోనిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్‌కే భవిష్యత్తు బాగుండాలంటే ధోని ఆ జట్టుతో తెగదెంపులు చేసుకోవాలని సూచించాడు.
ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘ధోని ఇప్పటికే తాను సాధించాల్సిందంతా సాధించేశాడు. ఆటలో తను ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అయితే, ఏం చేయాలన్నది మాత్రం అతడి ఇష్టమే.
కానీ నా అభిప్రాయం ప్రకారం.. జట్టు భవిష్యత్ దృష్ట్యా అతడు వచ్చే ఏడాది ఆడాల్సిన అవసరం లేదు. ఎంఎస్ ఐ లవ్ యూ. నువ్వొక చాంపియన్‌వి. ఐకాన్‌వి. నువ్వు ఇప్పటికే అన్నీ సాధించేశావు’’ అని ఆడం గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు.
ఆ నలుగురిని వదిలించుకోవాలి
అదే విధంగా.. సీఎస్‌కే వచ్చే ఏడాది ధోనితో పాటు షేక్ రషీద్, డెవాన్ కాన్వే, దీపక్ హుడాలను వదిలించుకోవాలని గిల్‌క్రిస్ట్ సలహా ఇచ్చాడు. కాగా ఆడం గిల్‌క్రిస్ట్ 2009లో దక్కన్ చార్జర్స్ (హైదరాబాద్ ఫ్రాంఛైజీ- ఇప్పుడు మనుగడలో లేదు) కెప్టెన్‌గా వ్యవహరించి.. జట్టుకు ట్రోఫీ అందించాడు. మొత్తంగా ఐపీఎల్‌లో 80 మ్యాచ్‌లు ఆడి 2069 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉండటం విశేషం.
ఇక అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా తరఫున గిల్‌క్రిస్ట్.. 96 టెస్టులు, 287 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 5570, 9619, 272 పరుగులు చేశాడు. మరోవైపు ధోని టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు.
టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన దిగ్గజ కెప్టెన్‌గా తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. భారత్ తరఫున మొత్తంగా 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు.
టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20లలో 1617 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో అత్యధికంగా ఇప్పటికి 273 మ్యాచ్‌లు ఆడిన ధోని 5383 పరుగులతో సీఎస్‌కే టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. అదే విధంగా కెప్టెన్‌గా సీఎస్‌కేకు టైటిల్ అందించిన ఘనత ధోని సొంతం.
చదవండి: IPL 2025: రసవత్తరంగా సాగుతున్న ప్లే ఆఫ్స్ రేసు.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు..!