హార్దిక్ అద్భుత‌మైన ప్లేయ‌ర్‌.. పాక్‌పై క‌చ్చితంగా చెల‌రేగతాడు: రైనా | Sakshi
Sakshi News home page

హార్దిక్ అద్భుత‌మైన ప్లేయ‌ర్‌.. పాక్‌పై క‌చ్చితంగా చెల‌రేగతాడు: రైనా

Published Mon, May 20 2024 5:27 PM

Hardik Pandya will perform well against Pakistan in T20 Wc, everyone will praise him: Suresh Raina

ఐపీఎల్‌-2024లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. కెప్టెన్‌గానే కాకుండా ఆట‌గాడిగా సైతం తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ ఏడాది సీజ‌న్‌కు ముందు ఆల్-క్యాష్ డీల్‌లో భాగంగా గుజ‌రాత్ నుంచి ముంబై జ‌ట్టుకు ట్రేడ్ అయిన హార్దిక్‌.. కెప్టెన్‌గా త‌న మార్క్ చూపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. 

అతని నాయకత్వంలో ముంబై ఇండియ‌న్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్ధానంలో నిలిచింది. ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవ‌లం 4 మ్యాచ్‌ల్లో మాత్రం విజ‌యం సాధించింది. అదే విధంగా హార్దిక్ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న కూడా అంతంత‌మాత్ర‌మే. ఈ ఏడాది సీజ‌న్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన పాండ్యా 18 స‌గ‌టుతో కేవ‌లం 216 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 

ఐపీఎల్‌లో హార్దిక్ విఫ‌ల‌మైనప్ప‌ట‌కి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ భార‌త జ‌ట్టులో మాత్రం చోటు ద‌క్కింది. కేఎల్ రాహుల్‌, గిల్ వంటి స్టార్ ఆట‌గాళ్ల‌కు చోటు ఇవ్వ‌కుండా హార్దిక్‌ను ఎంపిక చేయ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్‌న‌కు హార్దిక్‌ను ఎంపిక చేయ‌డాన్ని టీమిండియా మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా స‌పోర్ట్ చేశాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాండ్యా సత్తాచాటుతాడ‌ని రైనా జోస్యం చెప్పాడు.

"హార్దిక్ పాండ్యా టీమిండియాకు ఆడిన ప్ర‌తీ మ్యాచ్‌లోనూ త‌న‌వంతు న్యాయం చేసేవాడు. ఫామ్ అనేది తాత్కాలికం మాత్ర‌మే. అది శాశ్వతం కాదు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాకిస్తాన్‌పై హార్దిక్ బాగా రాణిస్తే, అంద‌రూ అత‌డిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతారని" క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రైనా పేర్కొన్నాడు. 

ఇక టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 జూన్ 1 నంచి ప్రారంభం కానుంది. భార‌త్ విష‌యానికి వ‌స్తే.. జూన్ 5న ఐర్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌తో త‌మ వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌నుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement