Hardik Pandya: 'ఆ విషయాలు పెద్దగా పట్టించుకోను.. భవిష్యత్తుకు డోకా లేనట్లే'

Hardik Pandya Comments After Team India Winning T20 Series Vs New Zeland - Sakshi

స్వదేశంలో టీమిండియా వరుస విజయాలతో దుమ్మురేపుతుంది. ఫార్మాట్‌ ఏదైనా విజయమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. వన్డే ప్రపంచకప్‌ 2023కు మరికొన్ని నెలలు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో జట్టులోని ఆటగాళ్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. బుధవారం జరిగిన మూడో టి20లో టీమిండియా 168 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించి టి20 చరిత్రలోనే భారీ మార్జిన్‌తో విజయం అందుకుంది. వన్డేలు, టెస్టులకు మాత్రమే పనికొస్తాడని విమర్శలు వచ్చిన వేళ.. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మరో సుడిగాలి శతకంతో ఆకట్టుకున్నాడు. ఇక టీమిండియా ఓపెనింగ్‌ విషయంలో అనుమానాలన్నీ తీరిపోయినట్లే. అంతేకాదు టి20ల్లో రోహిత్ స్థానంలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ రోల్‌లో ఫుల్‌గా ఫిట్‌ అయినట్లే.

మ్యాచ్‌ విజయం అనంతరం టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ.. ''(మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్) గెలుచుకోవడం నేను పెద్దగా పట్టించుకోను. నా అవార్డుకు ముందే మ్యాచ్‌లో కొన్ని అసాధారణమైన ప్రదర్శనలు వచ్చాయి. నా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌తో పాటు మేము గెలుచుకున్న ట్రోఫీని సపోర్ట్‌ స్టాఫ్‌కు అంకితం. వారు మమ్మల్ని ఫిట్‌గా ఉంచేందుకు ఎంతో సహాయపడ్డారు. ఈ విజయం మరువలేనిది. అనవసర విషయాల జోలికి పోకుండా నాకు ఏం కావాలో అదే సంపాదించడానికి ప్రయత్నిస్తాను.

ఎలాంటి ముందస్తు ఆలోచనలు లేవు. నా కెప్టెన్సీని చాలా సింపుల్‌గా ఉంచుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతాను.చాలెంజ్‌తో కూడిన మ్యాచ్‌లంటే మజా వస్తుంది. కెప్టెన్సీ విషయంలో ఒక సింపుల్‌ రూల్‌ ఫాలో అవుతా. నేను డౌన్‌లో ఉన్నప్పుడు నా కెప్టెన్సీ కూడా డౌన్‌లోనే ఉంటుంది. మేము ఇక్కడ గతేడాది ఐపీఎల్‌ ఫైనల్ ఆడినప్పుడు.. రెండవ ఇన్నింగ్స్ కాస్త ‍కష్టతరమని భావించాం. పిచ్‌, వాతావరణం కూడా రెండో బ్యాటింగ్‌ సమయంలో పూర్తిగా బౌలర్లకు అనుకూలిస్తుంది. అందుకే ఈ రోజు మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేశాం. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నా. 

ఇక శుబ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన ఆటగాడు. రోహిత్‌, రాహుల్‌ తర్వాత మాకు మంచి ఓపెనర్‌ దొరికినట్లే. అన్ని ఫార్మట్లకు తగినట్లుగా గిల్‌ తనను తాను మలుచుకుంటున్నాడు. ఇలాంటి పరిపూర్ణమైన బ్యాటర్లు ఉన్నంతవరకు టీమిండియా భవిష్యత్తుకు డోకా లేనట్లే. మా బౌలర్లు(నాతో సహా) పిచ్‌పై పదునును చక్కగా ఉపయోగించుకున్నారు. భారీ స్కోరు చేయడం మాకు కలిసొచ్చింది. సిరీస్‌లో ఏమైనా తప్పులు జరిగినా వచ్చే మ్యాచ్‌ల వరకు వాటిని సరిదిద్దుకుంటాం.'' అని చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top