Happy Birthday Suryakumar: సూర్యకుమార్‌లో మనకు తెలియని రొమాంటిక్‌ యాంగిల్‌

Happy Birthday Suryakumar-Yadav Intresting Facts Love Story-Wedding - Sakshi

టీమిండియాలో సూర్యకుమార్‌ ప్రస్తుతం ఒక సంచలనం. లేటు వయసులో జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికి తనదైన ఆటతీరుతో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. సూర్యకుమార్‌ షాట్లు కచ్చితంగా ఉంటాయి. ఎంత కచ్చితంగా అంటే.. టైమింగ్‌తో అతను కొట్టే షాట్లు బౌండరీ లేదా సిక్సర్‌ వెళుతుంటాయి. రాబోయే టి20 ప్రపంచకప్‌లో టీమిండియాలో సూర్యకుమార్‌ది కీలకపాత్ర అని చెప్పడంలో సందేహం లేదు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున ఆడుతూ వెలుగులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఇవాళ(సెప్టెంబర్‌ 14) 32వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సూర్య క్రికెట్‌ కెరీర్‌ గురించి ఎలాగూ అవగాహన ఉంటుంది. అందుకే సూర్య వ్యక్తిగత జీవితంతో పాటు అతనిలోని రొమాంటిక్‌ యాంగిల్‌ గురించి తెలుసుకుందాం.
-సాక్షి, వెబ్‌డెస్క్‌

సూర్య కెరీర్‌లో ఎదగడానికి అతిపెద్ద కారణం తన భార్య దేవిషా శెట్టి అని ప్రతీసారి పేర్కొంటాడు. ఇక సూర్యకుమార్‌ లవ్‌ జర్నీ తన 20 ఏళ్ల వయసులోనే మొదలైంది. సూర్య కంటే దేవిషా మూడేళ్లు చిన్నది. 12వ తరగతి తర్వాత ముంబైలో సూర్య చదివిన కాలేజీలో దేవిషా కూడా అడ్మిషన్ తీసుకుంది. కాలేజ్ ఫంక్షన్‌లో తొలిసారిగా దేవిషా డ్యాన్స్‌ని చూసిన సూర్య ఆమెను ఇష్టపడ్డాడు. అప్పటికి దేవిషా వయసు 17 ఏళ్లు మాత్రమే. 

క్రమంగా వీరి స్నేహం ప్రేమగా మారింది. అప్పటికి సూర్య ఐపీఎల్‌లో తనదైన ముద్ర వేశాడు. ఐదేళ్ల తర్వాత పెద్దల సమక్షంలో 2016లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి దేవిషా సూర్యకు అండగా నిలబడుతూ ప్రతీ విషయంలో అతన్ని ఉత్సాహపరుస్తూ వచ్చింది. తాను టీమిండియాలోకి రావడానికి దేవిషా కూడా కారణమని సూర్యకుమార్ కొంతకాలం క్రితం స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఆట, ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టడానికి వ్యక్తిగత జీవితంలోనూ ఒకరు తోడు ఉండాలని సూర్యకుమార్‌ కోరుకున్నాడు. అంతేకాదు సూర్యలో రొమాంటిక్‌ యాంగిల్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అతని ఛాతీపై భార్య పేరు పచ్చబొట్టులా రాసిపెట్టుకున్నాడు. దేవిషా తనతో ఉన్నా..లేకున్నా.. చాతిపై తన పేరు చూసినప్పుడల్లా మనసుకు దగ్గరగా ఉంటుందన్నాడు. ఇక దేవిషా ఒక సామాజిక కార్యకర్త(Social Activist). 2013 నుంచి 2015 వరకు దేవిషా ఎన్జీవోలో పనిచేశారు. అంతేకాదు దేవిషా స్వంతంగా డ్యాన్స్ స్కూల్‌ను కూడా నడిపింది.

ఇక తన భర్త సూర్యకుమార్‌ యాదవ్‌ పుట్టినరోజు సందర్భంగా దేవిషా శెట్టి శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌ చేసింది. ''20 ఏళ్ల కుర్రాడి నుంచి అనుభవజ్ఞుడైన, పరిణతి చెందిన వ్యక్తిగా ఎదగడం నేను చూశాను. నేను నిన్ను అప్పుడు ఎంత ప్రేమించానో.. ఇప్పటికీ అంతే ప్రేమిస్తున్నాను. నీ ప్రేమను పొందినందుకు చాలా కృతజ్ఞతలు. నువ్వే నా ప్రపంచం. కష్ట సమయాల్లో అండగా నిలబడ్డావు. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను'' అంటూ  ఎమోషనల్‌గా రాసుకొచ్చింది.

సూర్యకుమార్‌ క్రికెట్‌ కెరీర్‌ విశేషాలు, రికార్డులు
మార్చి 14, 2021లో ఇంగ్లండ్‌తో టి20 మ్యాచ్‌ ద్వారా టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ సిరీస్‌లో సూర్యకుమార్‌కు నాలుగో మ్యాచ్‌ వరకు అవకాశం రాలేదు.
ఆడిన తొలి మ్యాచ్‌లో తొలి బంతినే సూర్యకుమార్‌ బౌండరీగా మలిచాడు. టి20 క్రికెట్‌ను ఇలా బౌండరీతో మొదలుపెట్టిన తొలి క్రికెటర్‌ సూర్యకుమార్‌.
జూలై 2021లో శ్రీలంకతో తొలి వన్డే ఆడిన సూర్యకుమార్‌ మెయిడెన్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.
ఇక జూలై 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో శతకం బాదిన సూర్యకుమార్‌. 55 బంతుల్లోనే 117 పరుగులు చేసిన సూర్యకుమార్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలి శతకం.
టి20 క్రికెట్‌లో టీమిండియా తరపున సెంచరీ బాదిన ఐదో క్రికెటర్‌గా సూర్యకుమార్‌ నిలిచాడు. అంతేకాదు నాలుగు.. ఆ తర్వాత స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. 
సూర్యకుమార్‌ ఇప్పటివరకు టీమిండియా తరపున 13 వన్డేల్లో 340 పరుగులు, 28 టి20ల్లో 811 పరుగులు సాధించాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top