Happy Birthday Sourav Ganguly: మరిచిపోలేని దాదా నిర్ణయాలు

Happy Birthday Sourav Ganguly and Interesting Facts And Crucial Decisions By Dada - Sakshi

ఫుట్‌బాల్‌ మీద మమకారం ఉన్నప్పటికీ.. అన్నతో పడ్డ పోటీలో చివరికి అతనే పైచేయి సాధించాడు. అగ్రెస్సివ్‌ బ్యాట్స్‌మ్యాన్‌గా, యువ జట్టును సమర్థవంతంగా నడిపించిన సారథిగా దశాబ్దంపైగా టీమిండియాకు మరిచిపోలేని విజయాలెన్నింటినో అందించాడు సౌరవ్‌ ఛండీదాస్‌ గంగూలీ అలియాస్‌ దాదా. ప్రస్తుతం బీసీసీఐ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్న గంగూలీకి ఇవాళ 49వ పుట్టినరోజు.. 

వెబ్‌డెస్క్‌: పరిమిత ఓవర్లలోనే కాదు.. టెస్ట్‌ల్లోనూ రికార్డ్‌ స్ట్రయిక్‌ రేటుతో పరుగుల వరద పారించాడు సౌరవ్‌ గంగూలీ.  హీరో హోండా బ్యాట్‌(చాలా మ్యాచ్‌లు ఈ బ్యాట్‌తోనే ఆడాడు)తో ముందుకొచ్చి స్పిన్నర్ల బంతిని బౌండరీ అవతల పడేయడం, స్క్వేర్‌, ఫ్రంట్‌ ఫుట్‌, కవర్‌ షాట్లతో క్రీడాభిమానులందరినీ ఉర్రూతలూగించేవాడు. ఆయనది ఎడమ చేతి వాటం. అయితేనేం ఆఫ్‌ సైడ్‌లో అదిరిపోయే షాట్లతో ‘గాఢ్‌ ఆఫ్‌ ది ఆఫ్‌సైడ్‌ క్రికెట్‌’ ట్యాగ్‌లైన్‌ దక్కించుకున్నాడు సౌరవ్‌ గంగూలీ.


 
ఫియర్‌లెస్‌ బ్యాట్స్‌మన్‌గా..
దేశీవాళీ టోర్నీల్లో రాణించిన దాదా కెరీర్‌.. 1992లో విండీస్‌ మ్యాచ్‌తో మొదలైంది. కానీ, టీం కోసం కూల్‌ డ్రింక్స్‌ బాటిళ్లు మోయలేనంటూ వాదించి వేటుకు గురయ్యాడనే ఒక ప్రచారం ఇప్పటికీ వినిపిస్తుంటుంది(ఆ ప్రచారాన్ని దాదా కొట్టిపడేస్తుంటాడు). 1993-94, 94-95, 95-96 సీజన్లలో రంజీ, దులీప్‌ ట్రోఫీల్లో రాణించాడు గంగూలీ. ఆ పర్‌ఫార్మెన్స్‌ అతన్ని ఇంగ్లండ్‌ టూర్‌కి ఎంపిక చేయించింది. ఆ టూర్‌లో ఒకే ఒక్క వన్డే ఆడి.. డ్రెస్సింగ్‌ రూంకే పరిమితమయ్యాడు. అయితే సిద్ధూ వివాదాస్పద నిషష్క్రమణ తర్వాత ఆ ప్లేస్‌లో గంగూలీ టెస్ట్‌ మ్యాచ్‌లకు ఆడాడు. లార్డ్స్‌లో డెబ్యూలోనే గంగూలీ బాదిన శతకం ఒక తీపి గుర్తుగా ఉండిపోయింది. ఆ తర్వాత ఫియర్‌లెస్‌ బ్యాట్స్‌మ్యాన్‌గా గంగూలీ శకం నిర్విరామంగా కొనసాగింది. సచిన్‌, ద్రవిడ్‌, లక్క్ష్మణ్‌లాంటి సీనియర్లతో భాగస్వామిగా పరుగులు రాబట్టాడు గంగూలీ.

 

కెప్టెన్‌గా భేష్‌, ఆటగాడిగా.. 
ఆటగాడిగా అద్భుత ప్రదర్శన గంగూలీకి పగ్గాలు అప్పజెప్పేలా చేసింది. అయితే కెప్టెన్‌గా సమర్థతను నిరూపించుకున్న గంగూలీ.. ఆటగాడిగా మాత్రం మంచి పర్‌ఫార్మెన్స్‌ ఇవ్వలేకపోయాడు. ఇక కోచ్‌గా గ్రెగ్‌ ఛాపెల్‌ ఎంట్రీ.. వివాదాలతో దాదా ఆట తీరు దాదాపుగా మసకబారిపోయింది. చివరికి.. పూర్‌ ప్లేయర్‌గా కెప్టెన్సీకి.. ఆపై ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అయితే కెప్టెన్‌గా గంగూలీ తీసుకున్న కొన్ని సొంత నిర్ణయాలు మాత్రం.. టీమిండియా స్థితిగతుల్ని మలుపు తిప్పాయనే చెప్పొచ్చు. 

ద్రవిడ్‌ ప్లేస్‌లో లక్క్ష్మణ్‌.. 
అయితే 2001 ఈడెన్‌ గార్డెన్‌ టెస్ట్‌లో ఫాలో ఆన్‌తో గడ్డు స్థితి ఉన్న టైంలో ద్రవిడ్‌కు బదులు లక్క్ష్మణ్‌ను నెంబర్‌ 3 పొజిషన్‌లో పంపడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ, ఆ నిర్ణయం ఎలాంటి క్లాసిక్‌ విక్టరీని అందించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. 281 పరుగులతో లక్క్ష్మణ్‌ రాణించగా. చివరిరోజు బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పి అద్భుత విజయాన్ని అందించాడు హర్భజన్‌. తద్వారా కంగారుల పదహారు వరుస టెస్ట్‌ విజయాల పరంపరకు బ్రేక్‌ వేసింది గంగూలీ నేతృత్వంలోని టీమిండియా. ఈ విజయమే ఒకరకంగా తన కెరీర్‌ను నిలబెట్టిందని చాలాసార్లు గుర్తు చేసుకుంటాడు దాదా. ఇక వీరేంద్ర సెహ్వాగ్‌కు విధ్వంసకర బ్యాట్స్‌మ్యాన్‌గా గుర్తింపు ఉందన్నది తెలిసిందే. కానీ, తొలినాళ్లలో ఆరో నెంబర్‌ పొజిషన్‌లో బ్యాటింగ్‌ చేసేవాడు వీరూ. అంతెందుకు సౌతాఫ్రికా టెస్ట్‌ డెబ్యూలోనూ ఆరో నెంబర్‌​ పొజిషన్‌లో బ్యాటింగ్‌​సెంచరీ బాదాడు. అయితే డ్యాషింగ్‌ ఓపెనర్‌ అవసరమన్న ఉద్దేశంతో అప్పటి నుంచి వీరూని ఓపెనింగ్‌లో దించడం స్టార్ట్‌ చేశాడు గంగూలీ.

ద్రవిడ్‌ వికెట్‌ కీపర్‌గా.. 
గంగూలీ బ్యాట్స్‌మ్యాన్‌ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు మీడియం పేస్‌ బౌలింగ్‌తో అలరించేవాడు కూడా. ఇక నయన్‌ మోంగియా శకం ముగిశాక.. టీమిండియాకు ఫిక్స్‌డ్‌ వికెట్‌ కీపర్‌ సమస్య ఎదురైంది. ఆ టైంలో ఎందరినో కీపర్లుగా మార్చాడు గంగూలీ. కానీ, చివరాఖరికి ద్రవిడ్‌ను ఒప్పించి.. వికెట్ల వెనుకాల కూడా వాల్‌గా నిలబెట్టాడు. అంతేకాదు 2002-2004 మధ్య ద్రవిడ్‌ను 5 నెంబర్‌ పొజిషన్‌లో పంపి.. వన్డేలోనూ మంచి ఫలితాలను రాబట్టాడు గంగూలీ. చివరికి ధోనీని 3 స్థానంలో పంపడం, ఆ స్థానంలోనే వైజాగ్‌ వన్డేలో 148 పరుగులు బాదడం ఎవరూ మరచిపోలేరు. 

పెద్దన్నగా.. యువ టీంలో విజయపు కాంక్ష
2000 సంవత్సరం నుంచి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు క్రికెట్‌ను కమ్మేశాయి. అలాంటి కష్ట కాలంలో టీమిండియాను బలోపేతం చేసి.. జట్టుకు వైభవం తెచ్చింది దాదానే. ముఖ్యంగా యువ ఆటగాళ్లను ప్రోత్సహించి విజయ కాంక్షను రగిలించి ‘పెద్దన్నయ్య’(దాదా)గా నిలిచాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, ఎంఎస్‌ ధోనీ.. ఇలా దాదా నాయకత్వంలో పేరు తెచ్చుకున్న వాళ్లే. అంతేకాదు యువ టీంలో విదేశీ గడ్డ ఓటమి అనే భయాన్ని పొగొట్టి.. సమర్థవంతంగా జట్టును నడిపించిన ఘనత కూడా దాదాదే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top