రయ్‌.. రయ్‌... రసెల్‌.. సింగపూర్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ కైవసం | George Russell Clinches Victory At Singapore Grand Prix, McLaren Wins Constructors Championship | Sakshi
Sakshi News home page

రయ్‌.. రయ్‌... రసెల్‌.. సింగపూర్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ కైవసం

Oct 6 2025 9:59 AM | Updated on Oct 6 2025 11:04 AM

George Russell wins F1 Singapore Grand Prix a

సింగపూర్‌: ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జ్‌ రసెల్‌ తన ఖాతాలో రెండో విజయం వేసుకున్నాడు. ఆదివారం జరిగిన సింగపూర్‌ గ్రాండ్‌ప్రిలో రసెల్‌ విజేతగా నిలిచాడు. తుది రేసును ‘పోల్‌ పొజిషన్‌’ నుంచి ప్రారంభించిన రసెల్‌ వాయువేగంతో దూసుకెళ్లాడు. 

62 ల్యాప్‌ల రేసును రసెల్‌ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 40 నిమిషాల 22.367 సెకన్లలో పూర్తి చేశాడు. నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 1 గంట 40 నిమిషాల 27.792 సెకన్లలో రేసును పూర్తి చేసి రెండో స్థానం దక్కించుకున్నాడు.

గత రెండు రేసుల్లో ‘టాప్‌’లో నిలిచిన వెర్‌స్టాపెన్‌ మూడో రేసులోనూ దూసుకెళ్లినా... పోల్‌ పొజిషన్‌ నుంచి రేసును ఆరంభించిన రసెల్‌దే పైచేయి అయింది. రెండేళ్ల క్రితం ఇక్కడే జరిగిన రేసు చివరి ల్యాప్‌లో ప్రమాదానికి గురైన రసెల్‌ ఇప్పుడు అదే చోట విజేతగా నిలిచాడు. ‘ఈ అనుభూతి బాగుంది. కొన్నాళ్ల క్రితం ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ రోజు పోడియంపై నిలవలేకపోయా. 

ఇప్పుడు అది సాధ్యమైంది’ అని విజయం అనంతరం రసెల్‌ అన్నాడు. కెనడా గ్రాండ్‌ప్రి తర్వాత రసెల్‌కు ఈ ఏడాది ఇది రెండో టైటిల్‌. మెక్‌లారెన్‌ డ్రైవర్లు లాండో నోరిస్‌ (1 గంట 40 నిమిషాల 28.433 సెకన్లు), ఆస్కార్‌ పియాస్ట్రి (1 గంట 40 నిమిషాల 30.513 సెకన్లు) వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచారు.

ఈ సీజన్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన మెక్‌లారెన్‌ డ్రైవర్లకు గత మూడు రేసుల నుంచి అగ్రస్థానం దక్కలేదు. మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్‌ కిమి అంటొనెల్లి 1 గంట 40 నిమిషాల 56.048 సెకన్లు ఐదో స్థానం దక్కించుకోగా... చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (1 గంట 41 నిమిషాల 8.363 సెకన్లు; ఫెరారీ) ఆరో స్థానంలో నిలిచాడు. 

ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ (1 గంట 41 నిమిషాల 42.618 సెకన్లు) ఏడో స్థానానికి పరిమితమయ్యాడు. 24 రేసుల సీజన్‌లో 18 రేసులు ముగిసేసరికి ప్రపంచ డ్రైవర్స్‌ చాంపియన్‌íÙప్‌లో పియాస్ట్రి 336 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... నోరిస్‌ 314 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వెర్‌స్టాపెన్‌ 273 పాయింట్లతో మూడో స్థానాన్ని మరింత మెరుగు పర్చుకున్నాడు. తదుపరి రేసు ఈనెల 20న యునైటెడ్‌ స్టేట్స్‌ గ్రాండ్‌ప్రి జరుగనుంది. 

కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌... మెక్‌లారెన్‌ 
ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో మరో 6 రేసులు మిగిలుండగానే... మెక్‌లారెన్‌ జట్టు కన్‌స్ట్రక్టర్స్‌ (టీమ్‌) చాంపియన్‌íÙప్‌ కైవసం చేసుకుంది. 24 రేసుల సీజన్‌లో సింగపూర్‌ గ్రాండ్‌ప్రితో 18 రేసులు ముగియగా... 650 పాయింట్లతో మెక్‌లారెన్‌ జట్టు టీమ్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 

తాజా సీజన్‌లో మెక్‌లారెన్‌ డ్రైవర్లు 12 రేసుల్లో విజేతలుగా నిలిచారు. అందులో ఆస్కార్‌ పియాస్ట్రి 7 రేసులు నెగ్గగా... మరో ఐదింట నోరిస్‌ అగ్రస్థానం దక్కించుకున్నాడు. కన్‌స్ట్రక్టర్స్‌ చాంపియన్‌íÙప్‌లో మెర్సిడెస్‌ 325 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... ఫెరారీ 300 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన రేసుల్లో ఈ రెండు జట్లకు మెక్‌లారెన్‌ను అధిగమించే అవకాశం లేకపోవడంతో... ఆ జట్టు టీమ్‌ చాంపియన్‌గా నిలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement