
మూడు దశాబ్దాల తర్వాత ఇద్దరు చెస్ దిగ్గజాలు ‘ఢీ’
సెయింట్ లూయిస్ (అమెరికా): చదరంగ దిగ్గజాలు గ్యారీ కాస్పరోవ్ (రష్యా), విశ్వనాథన్ ఆనంద్ (భారత్) మరోసారి ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ‘క్లచ్ చెస్: ద లెజెండ్స్ టోర్నమెంట్’ పేరుతో ఈ ఇద్దరి మధ్య ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్‌లో మూడు రోజులపాటు టోర్నీని నిర్వహించనున్నారు. ‘చెస్ 960’ మ్యాచ్‌లో భాగంగా ఆనంద్, కాస్పరోవ్ 12 గేమ్‌లు ఆడతారు. ప్రతి రోజు వీరిద్దరి మధ్య నాలుగు గేమ్‌లు (రెండు ర్యాపిడ్, రెండు బ్లిట్జ్) జరుగుతాయి. మొదటి రోజున గేమ్ గెలిస్తే ఒక్కో పాయింట్ దక్కుతుంది.
రెండో రోజున గేమ్ గెలిస్తే రెండు పాయింట్ల చొప్పున... మూడో రోజున గేమ్ గెలిస్తే మూడు పాయింట్ల చొప్పున లభిస్తాయి. విజేతకు 70 వేల డాలర్లు (రూ. 62 లక్షలు), రన్నరప్ ప్లేయర్‌కు 50 వేల డాలర్లు (రూ. 44 లక్షలు) అందజేస్తారు. అధికారికంగా ఆనంద్, కాస్పరోవ్ చివరిసారి 1995లో క్లాసికల్ వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడ్డారు.
కాస్పరోవ్ 10.5–7.5తో ఆనంద్‌పై గెలిచి ప్రపంచ టైటిల్ దక్కించుకున్నాడు. 2004లో చెస్‌కు వీడ్కోలు పలికిన కాస్పరోవ్ ఎగ్జిబిషన్, బ్లిట్జ్ ఈవెంట్లలో... ఆనంద్ కొన్ని ఎంచుకున్న టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగుతున్నారు.