Triple Century Hero: అరంగేట్రంలో 4 రన్స్‌! మూడో మ్యాచ్‌లో ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ.. కానీ ఏడాదిలోనే ముగిసిన కెరీర్‌! అలా ప్రపంచంలో నం.1గా..

Forgotten Cricketer Tied Sehwag Record Only Other Indian to Score 300 Where - Sakshi

After Virender Sehwag Only Other Indian To Score Triple Century: అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన బ్యాటర్లు కోకొల్లలు. అదే ట్రిపుల్‌ సెంచరీ సాధించిన వాళ్లు మాత్రం అరుదు. ఆ జాబితాలో ఉన్న వాళ్లెవరనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్‌. ఈ టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌  2004లో తొలిసారి ఈ ఫీట్‌ అందుకున్నాడు.

అది కూడా మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ గడ్డపై 309 పరుగులు సాధించి ముల్తాన్‌ కింగ్‌గా నీరజనాలు అందుకున్నాడు. 2008లో స్వదేశంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో చెన్నైలో 319 పరుగులతో మెరిశాడు. 

ట్రిపుల్‌ సెంచరీతో అదరగొట్టి
మరి వీరూతో పాటుగా ఈ త్రిశతక లిస్టులో ఉన్న మరో భారత క్రికెటర్‌ గురించి తెలుసా? దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహించే రాజస్తాన్‌ బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌. 2013-14 సీజన్‌లో రంజీ ట్రోఫీలో అదరగొట్టిన ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ ఫైనల్లో ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగాడు.

328 పరుగులతో రాణించి కర్ణాటకు టైటిల్‌ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాతి రంజీ సీజన్‌లో రెండు శతకాలు బాదడంతో పాటుగా మరో రెండు హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు. ఇలా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన కరుణ్‌ నాయర్‌ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.

4 పరుగుల వద్ద రనౌట్‌.. తర్వాత ఎల్బీగా..
జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అతడు.. అదే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌తో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొహాలీలో మూడో టెస్టు సందర్భంగా తన తొలి మ్యాచ్‌ ఆడిన కరుణ్‌ నాయర్‌.. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌ అయి పూర్తిగా నిరాశపరిచాడు.

బ్యాట్‌ ఝులిపించి.. ట్రిపుల్‌ సెంచరీ బాది
తదుపరి ముంబై మ్యాచ్‌లోనూ 13 పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న కరుణ్‌.. ఐదో టెస్టులో మాత్రం బ్యాట్‌ ఝులిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు.

అంతర్జాతీయ కెరీర్‌లో కనీసం హాఫ్‌ సెంచరీ కూడా చేయకుండానే ఏకంగా త్రిశతకం బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఇన్నింగ్స్‌ 75 పరుగుల భారీ తేడాతో గెలవగా.. కరుణ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 

సెహ్వాగ్‌ తర్వాత రెండో భారత క్రికెటర్‌గా.. అలా ప్రపంచంలో నంబర్‌ 1
ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా.. ట్రిపుల్‌ సెంచరీతో మెరిసి ప్రపంచంలో ఈ ఘనత సాధించి మూడో క్రికెటర్‌గా కరుణ్‌ నాయర్‌ రికార్డులకెక్కాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు.  

ఏడాదిలోనే ముగిసిన కెరీర్‌
అదే విధంగా.. తక్కువ మ్యాచ్‌లు ఆడి టెస్టుల్లో త్రిశతకం నమోదు చేసిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత మెరుగ్గా రాణించలేకపోయిన కరుణ్‌ నాయర్‌ కెరీర్‌ మరుసటి ఏడాదే ముగిసింది. 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

తన కెరీర్‌లో మొత్తంగా టీమిండియా తరఫున 6 టెస్టులు, రెండు వన్డేలు ఆడిన కరుణ్‌ నాయర్‌ వరుసగా ఆయా ఫార్మాట్లలో మొత్తంగా 374, 39 పరుగులు చేయగలిగాడు. ఇక 2013 నుంచే ఐపీఎల్‌ ఆడుతున్న కరుణ్‌ ఆర్సీబీతో తన ప్రయాణం మొదలుపెట్టాడు.

ఇప్పుడు ఎక్కడ?
డానియల్‌ వెటోరీ, విరాట్‌ కోహ్లి సారథ్యంలో బెంగళూరు జట్టుకు ఆడిన అతడు.. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లకు కూడా ప్రాతినిథ్య వహించాడు. ఇక 2023 సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయపడిన నేపథ్యంలో.. అతడి స్థానాన్ని 31 ఏళ్ల కరుణ్‌ నాయర్‌తో భర్తీ చేసింది మేనేజ్‌మెంట్‌. ఇక కరుణ్‌ సనయ తంకరివాలాను వివాహమాడగా.. వారికి కుమారుడు జన్మించాడు.

చదవండి: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్‌.. విండీస్‌కు కూడా..! 
ఏదో క్లబ్‌గేమ్‌ ఆడుతున్నట్లు.. రాష్ట్రస్థాయి మ్యాచ్‌ అన్నట్లు! తిలక్‌ అలా.. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top