మరో 8 రోజుల్లో ఫుట్‌బాల్ ప్రపంచకప్
వేసవిలో వినోదం అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ముగిసింది. ఇక వర్షాకాలంలో ‘కిక్’ ఎక్కించేందుకు మరో క్రీడా సమరం ముస్తాబైంది. విశ్వవ్యాప్త క్రీడాభిమానులను ఉర్రూతలూగించేందుకు ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ వచ్చేస్తోంది. మరో ఎనిమిది రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెర లేవనుంది. క్వాలిఫయింగ్‌లో 200కు పైగా దేశాలు పోటీపడితే... చివరకు 45 దేశాలు తమ అత్యుత్తమ ఆటతీరుతో ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి.
ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లు నేరుగా అర్హత పొందాయి. ఓవరాల్‌గా 48 దేశాలు 39 రోజులపాటు విశ్వకిరీటం కోసం పోరాడనున్నాయి. జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియంలో మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలవుతుంది. జూలై 19న న్యూయార్క్ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. – సాక్షి క్రీడా విభాగం
సూపర్ స్టార్ మెస్సీ సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకుంటుందా? క్రిస్టియానో రొనాల్డోకు అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను పోర్చుగల్ అందిస్తుందా? నెమార్ తన మ్యాజిక్‌తో బ్రెజిల్‌కు పూర్వ వైభవం లభిస్తుందా? ఐదోసారి ప్రపంచకప్‌ను ముద్దాడి బ్రెజిల్ సరసన జర్మనీ నిలుస్తుందా? బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఉరుగ్వే, ఇంగ్లండ్, స్పెయిన్ కాకుండా కొత్త చాంపియన్‌ను ఈసారైనా చూస్తామా? వీటన్నింటికీ సమాధానం జూలై 19వ తేదీన లభిస్తుంది.
తొలిసారి మూడు దేశాల్లో...
ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరిగింది. 1930లో ఉరుగ్వే తొలి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లలో ప్రపంచకప్‌ను నిర్వహించలేదు. 1998 వరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీలకు ఒక దేశం వేదికగా జరిగాయి. 2002లో తొలిసారి దక్షిణ కొరియా–జపాన్ దేశాలు సంయుక్తంగా ప్రపంచకప్‌ను నిర్వహించాయి. 2026 ప్రపంచకప్ టోర్నీకి మొదటిసారి (అమెరికా, మెక్సికో, కెనడా) మూడు దేశాలు కలిసి ఆతిథ్యమిస్తున్నాయి. 2030 ప్రపంచకప్ కూడా మూడు దేశాల్లో (మొరాకో, పోర్చుగల్, స్పెయిన్) జరగనుంది. ఇక 2034 ప్రపంచకప్ టోర్నీ ఆతిథ్య హక్కులు సౌదీ అరేబియాకు లభించాయి.
మెక్సికో మూడోసారి...
ప్రపంచకప్‌ను అత్యధికంగా మూడుసార్లు నిర్వహించిన దేశంగా మెక్సికో రికార్డు నెలకొల్పనుంది. గతంలో మెక్సికోలో 1970, 1986 ప్రపంచకప్ టోర్నీలు జరిగాయి. బ్రెజిల్ (1950, 2014), ఫ్రాన్స్ (1938, 1998), జర్మనీ (1974, 2006), ఇటలీ (1934, 1990) రెండుసార్లు చొప్పున ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించగా... తాజాగా ఈ జాబితాలో అమెరికా (1996, 2026) కూడా చేరనుంది.
బ్రెజిల్ మాత్రమే...
ఇప్పటి వరకు జరిగిన ప్రతి ప్రపంచకప్‌లోనూ ఆడిన ఏకైక జట్టుగా బ్రెజిల్ గుర్తింపు పొందింది. 2026 ప్రపంచకప్‌తో కలిపి బ్రెజిల్ వరుసగా 23వసారి ఈ మెగా ఈవెంట్‌లో ఆడనుంది. రెండో స్థానంలో జర్మనీ (21 సార్లు), మూడో స్థానంలో అర్జెంటీనా (19 సార్లు), నాలుగో స్థానంలో ఇటలీ, మెక్సికో (18 సార్లు చొప్పున), ఐదో స్థానంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్ (17 సార్లు చొప్పున), ఆరో స్థానంలో బెల్జియం, ఉరుగ్వే (15 సార్లు చొప్పున) ఉన్నాయి.
48 జట్లతో...
మొదటి ప్రపంచకప్‌లో 13 దేశాలు పాల్గొన్నాయి. 1978 వరకు 16 జట్లతో నిర్వహించారు. 1982 నుంచి 1994 ప్రపంచకప్‌లను 24 జట్లకు అవకాశం ఇచ్చారు. 1998 నుంచి 2022 వరకు 32 దేశాలు ప్రపంచకప్ కోసం పోటీపడ్డాయి. తాజా ప్రపంచకప్‌లో ఏకంగా 48 జట్లు బరిలో ఉండనున్నాయి. 39 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జరుగుతాయి. అమెరికా అత్యధికంగా 78 మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుంది. మెక్సికో, కెనడా దేశాల్లో 13 మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. మ్యాచ్‌లు అమెరికాలోని 11 నగరాల్లో, మెక్సికోలోని 3 నగరాల్లో, కెనడాలోని 2 నగరాల్లో జరుగుతాయి.
నాకౌట్ దశకు 32 జట్లు
జట్ల సంఖ్య పెరగడంతో ఈసారి ఫార్మాట్ కూడా మారింది. మొత్తం 48 జట్లను 12 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ ముగిశాక 12 గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతోపాటు మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది ఉత్తమ జట్లు నాకౌట్ దశకు (32 జట్లు) అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ప్రిక్వార్టర్ ఫైనల్స్ (16 జట్లు), క్వార్టర్ ఫైనల్స్ (8 జట్లు), సెమీఫైనల్స్ (4 జట్లు), ఫైనల్ (2 జట్లు) జరుగుతాయి. నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ వరుసగా మూడోసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందడంలో విఫలం కాగా... కెప్ వెర్డె, కురసావ్, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ జట్లు తొలిసారి ప్రపంచకప్‌లో అరంగేట్రం చేయనున్నాయి.

నిద్ర మానేసి...
ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 9:30, 10:30 నుంచి; అర్ధరాత్రి గం. 12:30 నుంచి, గం. 1:30 నుంచి; తెల్లవారుజాము గం. 3:30 నుంచి, 4:30 నుంచి; ఉదయం గం. 6:30 నుంచి, గం. 7:30 నుంచి, గం. 9:30 నుంచి జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో అభిమానులు ప్రపంచకప్ మ్యాచ్‌లు తిలకించాలంటే రాత్రంతా నిద్ర మానేయాల్సి ఉంటుంది. భారత్‌లో మ్యాచ్‌లను ‘జీ’ స్పోర్ట్స్ చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయున్నాయి.


