IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్‌ చేయలేరు!? | Five IPL records May impossible to break but not for Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్‌ చేయలేరు!?

Mar 30 2026 5:02 PM | Updated on Mar 30 2026 5:26 PM

Five IPL records May impossible to break but not for Vaibhav Sooryavanshi

గత ఏడాది కాలంగా రికార్డుల మోత మోగిస్తున్నాడు భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు ఈ బిహారీ పిల్లాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున బరిలోకి దిగి అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

ఆ తర్వాత భారత్‌ అండర్‌-19 జట్టు తరఫునా వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 80 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 175 పరుగులు సాధించడం విశేషం. తద్వారా భారత్‌ మరోసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన వైభవ్‌ సూర్యవంశీ.. ఐపీఎల్‌-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇక క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఇప్పటి వరకు ఓ ఐదు ప్రధాన రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. మరి వైభవ్‌ సూర్యవంశీ వాటిని ఈసారి బ్రేక్‌ చేయగలడా?

అత్యధిక వ్యక్తిగత స్కోరు
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ కొనసాగుతున్నాడు. ఈ వెస్టిండీస్‌ దిగ్గజం ఆర్సీబీ తరఫున పుణె వారియర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు.

ఐపీఎల్‌ 2013 ఎడిషన్‌లో కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక ఇటీవలే వైభవ్‌ సూర్యవంశీ ఈసారి తన టార్గెట్‌ గేల్‌ రికార్డు బద్దలు కొట్టడమే అని తెలిపిన సంగతి తెలిసిందే. మరి ఈ సీజన్‌లోనే ఈ కుర్రాడు గేల్‌ను అధిగమిస్తాడో? లేదో? చూడాలి.

ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు
యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ విధ్వంసకర ఆట తీరుకు పెట్టింది పేరు. ఆర్సీబీ తరఫున పుణెపై 2013 నాటి మ్యాచ్‌లో అతడు ఏకంగా 17 సిక్సర్లు బాదాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.

ఇక వైభవ్‌ సూర్యవంశీ ఇటీవల అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్లో, యూత్‌ టీ20 మ్యాచ్‌లో ఏకంగా 15 సిక్సర్లు బాదాడు. గేల్‌ రికార్డును వైభవ్‌ ఈసారి బ్రేక్‌ చేసే అవకాశాలు లేకపోలేదు.

ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు
ఐపీఎల్‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ క్రిస్‌ గేల్‌ నిలిచాడు. 2012 సీజన్‌లో ఈ విండీస్‌ లెజెండ్‌ 59 సిక్సర్లు బాదాడు. ఇక 2019లో ఆండ్రీ రసెల్‌ 52 సిక్స్‌లు బాదాడు. ఈ రికార్డులను వైభవ్‌ బద్దలు కొట్టే అవకాశం ఉంది. గతేడాది ఐపీఎల్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్‌ 24 సిక్సర్లు బాదాడు.

సీజన్‌లో అత్యధిక స్ట్రైక్‌రేటు
ఐపీఎల్‌ 2024 సీజన్లో ఆస్ట్రేలియా స్టార్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 141 బంతులు ఎదుర్కొని 234.34 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. తద్వారా ఓ సీజన్లో అత్యధిక స్ట్రైక్‌రేటు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతేడాది వైభవ్‌ 122 బంతులు ఎదుర్కొని 206కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు.

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు
ఫస్ట్‌ క్లాస్‌, లిస్ట్‌-ఎ, టీ20 మ్యాచ్‌లలో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు. అయితే, ఐపీఎల్‌లో మాత్రం ఇంత వరకు ఏ ఆటగాడికీ ఈ ఘనత సాధ్యం కాలేదు. క్రిస్‌గేల్‌, రాహుల్‌ శర్మ, రాహుల్‌ తెవాటియా, రవీంద్ర జడేజా, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌ ఇప్పటి వరకు ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదగలిగారు.

చదవండి: జడ్డూ, సందీప్‌ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?: సంగక్కర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement