రియాన్ పరాగ్ (PC: BCCI)
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ ఎంపిక పట్ల విమర్శలు కొనసాగుతున్నాయి. టీమిండియా స్టార్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ పేర్లు కెప్టెన్సీ రేసులో బలంగా వినిపించినా యాజమాన్యం మాత్రం ఆఖరికి పరాగ్‌కే పగ్గాలు అప్పగించింది. ఈ అసోం ఆల్‌రౌండర్ గతేడాది తాత్కాలిక కెప్టెన్‌గా నిరాశపరిచినా అతడిపై మేనేజ్‌మెంట్ మరోసారి నమ్మకం ఉంచింది.
ఇక ఐపీఎల్-2026లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్ సోమవారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాజస్తాన్ హెడ్‌కోచ్, క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కర రియాన్ పరాగ్ (Riyan Parag)ను కెప్టెన్ చేయడానికి గల కారణాలు వెల్లడించాడు.
కఠినమైన పరీక్షలు
‘‘రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో సందీప్ శర్మ (Sandeep Sharma), రవీంద్ర జడేజాతో కలిపి ఐదుగురు పోటీదారులు ఉన్నారు. వీరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు మేము ఎంతగానో శ్రమించాము. కఠినమైన పరీక్షలు పెట్టాము.
వీరితో జరిగిన సంభాషణల్లో భాగంగా ప్రతి ఒక్కరు కెప్టెన్ క్యాండిడేట్ అని నిరూపించుకున్నారు. అయితే, అందరిలోకెల్లా రియాన్ అగ్రస్థానంలో నిలిచాడు. కఠినమైన ప్రశ్నలకు అతడు జవాబు ఇచ్చిన తీరు అమోఘం. అతడు ఎంతగానో పరిణతి చెందాడు.
అత్యంత పరిణతి చెందిన ఆటగాడిగా
కెప్టెన్సీ, నాయకత్వం మధ్య సన్నని గీత ఉంటుంది. ఈ రెండూ అంత తేలికైన విషయాలేమీ కాదు. ఇతరులతో పోల్చి చూసినపుడు అతడు అత్యంత పరిణతి చెందిన ఆటగాడిగా కనిపించాడు. ఏదేమైనా ఏ కెప్టెన్, నాయకుడు పరిపూర్ణంగా ఉండరు.
ఆటలో గెలుపు- ఓటములు సహజం. నేను కూడా పొరపాట్ల నుంచి నేర్చుకుని ఎదిగిన వాడినే. రియాన్ పరాగ్‌కు క్లిష్ట సమయాల్లో సాయం చేసేందుకు జట్టులో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు.
వారి మద్దతు ఉంటుంది
కష్ట సమయంలో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, సందీప్ శర్మ, షిమ్రన్ హెట్‌మెయిర్, జోఫ్రా ఆర్చర్, దసున్ షనక.. తదితరులపై అతడు ఆధారపడగలడు’’ అని సంగక్కర చెప్పుకొచ్చాడు. కాగా సుదీర్ఘకాలంగా తమ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్ చేసిన రాజస్తాన్.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులో చేర్చుకుంది.
చదవండి: అతడొక అద్భుతమైన ఫీల్డర్.. ఎందుకిలా చేశారు?: మాజీ కెప్టెన్ ఫైర్


