FIFA World Cup 2022: ‘ఫ్రెంచ్‌ కిక్‌’ అదిరేనా!

FIFA World Cup 2022, Group D: France, Denmark, Australia and Tunisia - Sakshi

గ్రూప్‌ ‘డి’లో డిఫెండింగ్‌ చాంపియన్‌

స్టార్‌ ఆటగాళ్లతో కళకళ

తొలి దశ దాటాకే అసలు పరీక్ష  

తొమ్మిది దశాబ్దాల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో డిఫెండింగ్‌ చాంపియన్‌ జట్టు టైటిల్‌ నిలబెట్టుకొని 60 ఏళ్లు గడిచాయి. చివరిసారి బ్రెజిల్‌ జట్టు ఈ ఘనత సాధించింది. బ్రెజిల్‌ వరుసగా 1958, 1962 ప్రపంచకప్‌లలో చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మరో విజేత జట్టు తదుపరి ప్రపంచకప్‌లో టైటిల్‌ సాధించలేకపోయింది. 1994 తర్వాత ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన యూరోప్‌ జట్టు తదుపరి వరల్డ్‌కప్‌లో గ్రూప్‌ దశ దాటడంలో విఫలమవుతోంది.

చరిత్రపరంగా చూస్తే ప్రస్తుత విజేత ఫ్రాన్స్‌ జట్టుకు ప్రతికూలాంశాలు ఉన్నాయనుకోవాలి. కానీ ఎంతోమంది స్టార్‌ ఆటగాళ్లతో కళకళలాడుతున్న ఫ్రాన్స్‌ జట్టు ఖతర్‌లో చరిత్రను తిరగరాస్తుందా? 60 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ టైటిల్‌ నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలుస్తుందా వేచి చూడాలి. ఫ్రాన్స్‌ బలగాన్ని చూస్తే మాత్రం గ్రూప్‌ ‘డి’లో ఉన్న మిగతా జట్లు డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియాలను దాటుకొని నాకౌట్‌ దశకు చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరో అవకాశం ఉండని నాకౌట్‌ దశ నుంచి ఆ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి.

ఫ్రాన్స్‌
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: విజేత (1998, 2018).
‘ఫిఫా’ ర్యాంక్‌: 4.
అర్హత ఎలా: యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ గ్రూప్‌ ‘డి’ విన్నర్‌.  

ప్రపంచకప్‌లో 16వసారి బరిలోకి దిగుతున్న ఫ్రాన్స్‌ జట్టు క్వాలిఫయింగ్‌ పోటీల్లో అజేయంగా నిలిచింది. యూరో టోర్నీలో వైఫల్యం తర్వాత గత ఏడాది నేషన్స్‌ లీగ్‌ టైటిల్‌ను సాధించి ‘ది బ్లూస్‌’ జట్టు ఫామ్‌లోకి వచ్చింది. వ్యక్తిగత వివాదాల్లో ఇరుక్కొని 2018 ప్రపంచకప్‌నకు దూరమైన 34 ఏళ్ల స్టార్‌ స్ట్రయికర్‌ కరీమ్‌ బెంజెమా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్‌ ఆడనుండటం శుభసూచకం. ఈ ఏడాది యూరోప్‌ ప్రొఫెషనల్‌ లీగ్స్‌ చాంపియన్స్‌ లీగ్, లా లీగాలో రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌ జట్టుకు టైటిల్‌ దక్కడంలో కరీమ్‌ బెంజెమా కీలకపాత్ర పోషించాడు. కరీమ్‌ బెంజెమాతోపాటు ఇతర స్టార్‌ ఆటగాళ్లు కిలియాన్‌ ఎంబాపె, గ్రీజ్‌మన్, థియో హెర్నాండెజ్‌ రాణిస్తే మాత్రం ఫ్రాన్స్‌ జట్టు ఈసారీ ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్రూప్‌ దశలో ఒక్క డెన్మార్క్‌ తప్ప ఇతర జట్ల నుంచి ఫ్రాన్స్‌కు గట్టిపోటీ లభించే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. గ్రూప్‌ దశ దాటి నాకౌట్‌ మ్యాచ్‌లకు అర్హత పొందాకే ఫ్రాన్స్‌ జట్టుకు అసలు సవాళ్లు ఎదురవుతాయి.  

డెన్మార్క్‌
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్‌ ఫైనల్స్‌ (1998).
‘ఫిఫా’ ర్యాంక్‌: 10.
అర్హత ఎలా: యూరోపియన్‌ క్వాలిఫయింగ్‌ గ్రూప్‌ ‘ఎఫ్‌’ విన్నర్‌.  

ఆరోసారి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న డెన్మార్క్‌ క్వాలిఫయింగ్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆడిన పది మ్యాచ్‌ల్లో తొమ్మిదింట గెలిచి, కేవలం ఒక మ్యాచ్‌లో ఓడింది. 30 గోల్స్‌ సాధించి, కేవలం మూడు గోల్స్‌ ప్రత్యర్థి జట్లకు ఇచ్చింది. స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియన్‌ ఎరిక్సన్‌పైనే అందరి దృష్టి ఉంది. ఒకరిద్దరిపైనే ఆధారపడకుండా సమష్టిగా రాణించడం డెన్మార్క్‌ జట్టు ప్రత్యేకత. తమ గ్రూప్‌లో ఫ్రాన్స్‌ జట్టుతో మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్‌ల్లో డెన్మార్క్‌ జట్టుకు విజయాలు దక్కే అవకాశాలున్నాయి. తాము ఆడిన గత నాలుగు ప్రపంచకప్‌లలో డెన్మార్క్‌ గ్రూప్‌ దశను దాటి నాకౌట్‌ రౌండ్‌ మ్యాచ్‌లకు అర్హత సాధించింది. ఈసారి ఆ జట్టు ప్రస్థానం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ముగుస్తుందో ముందుకు సాగుతుందో చూడాలి.  

ఆస్ట్రేలియా
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ (2006).
‘ఫిఫా’ ర్యాంక్‌: 38.
అర్హత ఎలా: ఆసియా–దక్షిణ అమెరికా మధ్య ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ విజేత.  

ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా నాకౌట్‌ దశకు చేరాలంటే విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ట్యునీషియాపై ఆ జట్టుకు గెలిచే అవకాశాలున్నా... ఫ్రాన్స్, డెన్మార్క్‌ జట్ల మ్యాచ్‌ల ఫలితాలే ఆ జట్టుకు కీలకం కానున్నాయి. యూరోపియన్‌ లీగ్స్‌లో పలు మేటి జట్లకు ఆడిన స్ట్రయికర్‌ అజ్దిన్‌ రుస్టిక్‌పై ఆసీస్‌ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. గత రెండు ప్రపంచకప్‌లలో ఆసీస్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఈసారి తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌తో ఆడనున్న ఆస్ట్రేలియా కనీసం ‘డ్రా’తో గట్టెక్కినా అది విజయంతో సమానమే.  

ట్యునీషియా
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: గ్రూప్‌ దశ (2018).
‘ఫిఫా’ ర్యాంక్‌: 30.
అర్హత ఎలా: ఆఫ్రికా క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్‌ విన్నర్‌.

ఆరోసారి ప్రపంచకప్‌ ఆడుతున్న ట్యునీషియా జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎక్కువగా రక్షణాత్మకంగా ఆడే అలవాటున్న ట్యునీషియా ఈ ఏడాది 12 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు గోల్స్‌ మాత్రమే తమ ప్రత్యర్థి జట్లకు కోల్పోయింది. వాబి ఖాజ్రి, యూసెఫ్‌ మసాక్ని, నయీమ్‌ జట్టులోని కీలక ఆటగాళ్లు. పటిష్ట జట్లయిన ఫ్రాన్స్, డెన్మార్క్‌లతో జరిగే మ్యాచ్‌లే ఈ మెగా ఈవెంట్‌లో ట్యునీషియా ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి.   

–సాక్షి క్రీడా విభాగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top