
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్‌గా పేరొందిన ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయసులో ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం జలంధర్-పఠాన్‌కోట్ హైవేపై కారు ఢీకొనడంతో ఫౌజా సింగ్ తలకు తీవ్ర గాయమైంది. ఫౌజాను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రాణాలు వదిలారు.
ఫౌజా సింగ్ మృతదేహాన్ని విదేశాల్లో నివసిస్తున్న అతని పిల్లలు వచ్చే వరకు మార్చురీలో ఉంచనున్నారు. వారు వచ్చిన తర్వాతే అతని అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫౌజా సింగ్ మరణం పట్ల పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫౌజా కుటుంబానికి, అతని అభిమానులకు సానుభూతి తెలియజేశారు. ఫౌజా ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
114 ఏళ్ల వయసులోనూ ఫౌజా తన బలం మరియు నిబద్ధతతో తరతరాలను ప్రేరేపించాడని అన్నారు. గతేడాది 'నాషా ముక్త్ - రంగాలా పంజాబ్' మార్చ్‌లో ఫౌజాతో పాటు నడిచే గౌరవం లభించిందని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు గులాబ్ చంద్ కటారియా తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
కాగా, ఫౌజా సింగ్ 1911 ఏప్రిల్ 1న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. భార్య, కొడుకు మరణంతో ఫౌజా సింగ్ మానసిక సమస్యలతో పోరాడుతూ 1992లో మరాథాన్‌వైపు మళ్ళారు. అప్పటి నుంచి ఫౌజా మారథాన్‌లో సంచలన ప్రదర్శనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఫౌజా సింగ్ లండన్, టొరంటో, న్యూయార్క్ వంటి ప్రముఖ అంతర్జాతీయ మారథాన్‌లలో పాల్గొన్నారు. 42 కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు టొరంటో మారథాన్‌ను 5 గంటలు 44 నిమిషాలు 4 సెకన్లలో ముగించి రికార్డు నెలకొల్పాడు.
ఫౌజా 2004 ఏథెన్స్ మరియు 2012 లండన్ ఒలింపిక్స్ లకు టార్చ్ బేరర్ గా ఉన్నాడు. దిగ్గజ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్, బాక్సింగ్ లెజెండ్ ముహమ్మద్ అలీతో కలిసి ఓ ప్రధాన క్రీడా బ్రాండ్ కోసం ప్రకటనలో కనిపించారు.