ఐపీఎల్-2026 ముగిసి నెల రోజుల కూడా కాకముందే అప్పుడే వచ్చే ఏడాది సీజన్ గురుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్‌ను వదిలి తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అందుకు బదులుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను లక్నోకు ఇచ్చేందుకు ఢిల్లీ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. పంత్‌ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు రికార్డు ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజా డీల్ ప్రకారం పంత్ తన జీతాన్ని తగ్గించుకుని రూ.15 కోట్లకు ఢిల్లీకి వచ్చేందుకు అంగీకరించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
అంతేకాకుండా అక్షర్ పటేల్ స్ధానంలో కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ కెప్టెన్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ దొడ్డ గణేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ పంత్ గనుక ఢిల్లీ జట్టులోకి వస్తే, రాహుల్ ఢిల్లీ ఫ్రాంచైజీని వీడాలని అతడు సూచించాడు. ప్రస్తుతం అతడు చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమయ్యాయి.
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాహుల్‌ను రూ.14 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. గతేడాది సీజన్‌లో 539 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన రాహుల్.. ఐపీఎల్-2026లో కూడా అదరగొట్టాడు. కేవలం 14 ఇన్నింగ్స్‌ల్లోనే 45.61 సగటుతో, 174.41 భారీ స్ట్రైక్ రేట్‌తో 593 పరుగులు చేశాడు.
ఇందులో 5 అర్ధసెంచరీలు, ఒక అద్భుత శతకం ఉన్నాయి. మరోవైపు రిషబ్ పంత్ తన ఐపీఎల్ కెరీర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌తోనే ప్రారంభించాడు. ఇప్పుడు మళ్లీ తన సొంత గూటికి వచ్చేందుకు సిద్దమయ్యాడు.
చదవండి: IND vs AFG: రోహిత్ శర్మ హ్యాట్రిక్.. వీడియో వైరల్


