
ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ వేసిన బంతి భారత ఆటగాడు సిరాజ్ బ్యాట్‌ను తాకి కింద పడిన బంతి అనూహ్యంగా అతని వెనుక వైపునకు వెళ్లి స్టంప్స్‌కు తగిలింది. అంతే...చివరి వికెట్ తీసిన ఇంగ్లండ్ లార్డ్స్ మైదానంలో 22 పరుగులతో అద్భుత విజయాన్ని అందుకుంది. అప్పటికే 29 బంతులు ఆడి జడేజాకు సహకరించిన సిరాజ్ తీవ్ర నిరాశలో మునిగిపోగా, బౌలర్ బషీర్ సంబరాలు చేసుకున్న ఈ దృశ్యం అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉంది.
ఈ మ్యాచ్‌లో ఎడమ చేతికి గాయమైన బషీర్ రెండో ఇన్నింగ్స్‌లో 35 బంతులు మాత్రమే వేసి ఈ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ ఘటనను బషీర్ చాలా సంతోషంగా గుర్తు చేసుకున్నాడు. ఆ అనుభూతి తాను ఎప్పటికీ మర్చిపోలేనని అతను వ్యాఖ్యానించాడు.
‘మేం పట్టుదలగా ప్రయత్నిస్తున్నా వికెట్ మాత్రం దక్కడం లేదు. బయట కూర్చున్న నేను ఎలాగైనా మైదానంలోకి దిగాలని పదే పదే కోరుకున్నాను. నాపై నమ్మకంతో స్టోక్స్ అవకాశం ఇచ్చాడు. నేను మ్యాచ్ ఫలితాన్ని మార్చగలగడం సంతోషాన్నిచ్చింది.
సిల్లీ పాయింట్‌లో రూట్‌ను పెట్టి సిరాజ్‌పై ఒత్తిడి పెంచుతూ ప్రతీ బంతి భిన్నంగా వేసేందుకు ప్రయతి్నంచాం. సిరాజ్ ఆ బంతిని ఆడాక అసలేం అర్థం కాలేదు. అందరూ ఎటు పోయింది అని చూస్తున్నారు. నాకైతే అస్సలు కనిపించలేదు. మావాళ్ల స్పందన చూసిన తర్వాతే నేనూ స్పందించాను.
ఆ క్షణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లార్డ్స్‌లాంటి ప్రత్యేక మైదానంలో స్టేడియం నిండుగా ఉన్న అభిమానుల మధ్య లభించిన ఆ ఆనందానికి మించి ఇంకేం ఉంటుంది’ అని బషీర్ భావోద్వేగం ప్రదర్శించాడు. ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఇచ్చిన సూచనలతోనే తన ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఎంతో మెరుగైందని బషీర్ అన్నాడు. తనకు అలీ ఎంతో సహకరించాడని బషీర్ చెప్పాడు.
‘తొలి టెస్టు సమయంలోనే మొయిన్ అలీని కలిశాను. క్యారమ్ బాల్ వేయమని అతను ప్రోత్సహించాడు. దాంతో ప్రాక్టీస్‌తో మెరుగుపర్చుకున్నా. ఇంగ్లండ్‌లో ఒక ఆఫ్‌స్పిన్నర్ రాణించడం అంత సులువు కాదు. అలీ నన్ను సరిగ్గా మార్గనిర్దేశనం చేశాడు. ఇంగ్లండ్ శిబిరానికి ఆయన వచ్చిన తర్వాత నా మీద నాకు నమ్మకం పెరిగింది’ అని బషీర్ వెల్లడించాడు.
లార్డ్స్ మ్యాచ్ తర్వాత గాయంతో బషీర్ చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. భారత్‌తో సిరీస్ చాలా అద్భుతంగా సాగిందని, పలువురు గొప్ప ఆటగాళ్లకు ప్రత్యరి్థగా తలపడి తాను ఎంతో నేర్చుకున్నానన్న ఈ ఇంగ్లండ్ స్పిన్నర్...తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.