బెల్లింగ్‌హామ్ డబుల్.. క్వార్టర్ ఫైనల్‌కు ఇంగ్లండ్‌ | England defeat Mexico in Round of 16 match of FIFA World Cup 2026 | Sakshi
Sakshi News home page

బెల్లింగ్‌హామ్ డబుల్.. క్వార్టర్ ఫైనల్‌కు ఇంగ్లండ్‌

Jul 6 2026 9:06 AM | Updated on Jul 6 2026 9:15 AM

England defeat Mexico in Round of 16 match of FIFA World Cup 2026

ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్ ఆఫ్-16లో ఇంగ్లండ్ అసాధారణ పోరాట పటిమ ప్రదర్శించింది. సహ ఆతిథ్య దేశమైన మెక్సికోపై 3-2తో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్టార్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ రెండు నిమిషాల్లో (36, 38) రెండు గోల్స్ చేసి జట్టుకు బలమైన పునాది వేయగా, కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ ద్వారా మరో గోల్ (60) సాధించాడు. రెండో అర్ధభాగంలో జారెల్ క్వాన్సా రెడ్ కార్డ్‌తో బయటకు వెళ్లినా, ఇంగ్లండ్‌ పది మంది ఆటగాళ్లతో చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంది.

రెండు నిమిషాల్లో మ్యాచ్‌ను మార్చేసిన బెల్లింగ్‌హామ్
మెక్సికో అభిమానుల హోరాహోరీ మద్దతు మధ్య ప్రారంభమైన ఈ నాకౌట్ పోరులో తొలి అర్ధభాగం వరకు ఇరు జట్లు సమానంగా పోటీపడ్డాయి.

36వ నిమిషంలో బెల్లింగ్‌హామ్ తొలి గోల్‌తో ఇంగ్లండ్‌కు ఆధిక్యం అందించాడు. ఆ గోల్‌కు కేవలం 98 సెకన్ల వ్యవధిలోనే మరోసారి గోల్ చేసి స్కోరును 2-0కు చేర్చాడు. అతని వేగవంతమైన డబుల్‌తో మెక్సికో ఒక్కసారిగా ఒత్తిడిలో పడింది.

వెనకడుగు వేయని మెక్సికో
రెండు గోల్స్ వెనుకబడినా మెక్సికో ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. 42వ నిమిషంలో జూలియన్ క్విన్యోనెస్ గోల్ చేసి స్కోరును 2-1కు తగ్గించాడు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి మ్యాచ్ మళ్లీ ఆసక్తికరంగా మారింది.

కేన్ గోల్.. క్వాన్సా రెడ్ కార్డ్
రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లండ్‌కు పెనాల్టీ లభించింది. 60వ నిమిషంలో కెప్టెన్ హ్యారీ కేన్ దాన్ని గోల్‌గా మలిచి జట్టుకు 3-1 ఆధిక్యం అందించాడు.

అయితే మ్యాచ్ మలుపు తిరిగింది జారెల్ క్వాన్సా రెడ్ కార్డ్‌తో. ప్రత్యర్థి దాడిని అడ్డుకునే క్రమంలో అతడు నేరుగా రెడ్ కార్డ్ అందుకోవడంతో ఇంగ్లండ్ పది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్‌ను కొనసాగించాల్సి వచ్చింది.

చివరి వరకు ఉత్కంఠ
సంఖ్యా బలాన్ని ఉపయోగించుకుంటూ మెక్సికో వరుస దాడులు చేసింది. రౌల్ జిమెనెజ్ మరో గోల్ చేసి స్కోరును 3-2కు తీసుకువచ్చాడు. చివరి నిమిషాల్లో మెక్సికో సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా, ఇంగ్లండ్ రక్షణ ఆటగాళ్లు అసాధారణ పోరాటాన్ని ప్రదిర్శించి మ్యాచ్‌ను కాపాడుకున్నారు.

క్వార్టర్ ఫైనల్‌లో నార్వేతో పోరు
ఈ విజయంతో ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. రౌండ్ ఆఫ్-16లో బ్రెజిల్‌ను ఓడించిన నార్వేతో త్రీ లయన్స్ తలపడనున్నాయి. హాలాండ్ సారథ్యంలోని నార్వేను ఎదుర్కోవడం ఇంగ్లండ్‌కు కఠిన సవాలుగా మారనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement