నెరవేరిన కేన్ కల
బెర్లిన్: ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు... ఏకంగా ఆరుసార్లు కెరీర్లో మేజర్ ట్రోఫీలు సాధించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ ఏడో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ప్రతిష్టాత్మక జర్మనీ అంతర్జాతీయ ఫుట్‌బాల్ లీగ్ బుండెస్‌లీగాలో హ్యారీ కేన్ తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. 2024–2025 బుండెస్లీగా సీజన్లో బాయెర్న్ మ్యూనిక్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టును విజేతగా నిలబెట్టాడు. ఈ క్రమంలో తన కెరీర్లో లోటుగా ఉన్న మేజర్ ట్రోఫీని అందుకున్నాడు.బొరుసియా మొంచెన్గ్లాడ్బాచ్ క్లబ్‌తో జరిగిన 33వ లీగ్ మ్యాచ్‌లో మాన్యుయెల్ నెయుర్ సారథ్యంలోని బాయెర్న్ మ్యూనిక్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గెలిచింది. తద్వారా ఈ సీజన్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బాయెర్న్ మ్యూనిక్ జట్టు రికార్డుస్థాయిలో 33వసారి బుండెస్లీగా టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మ్యూనిక్ జట్టుకు హ్యారీ కేన్ (31వ నిమిషంలో), మైకేల్ ఒలిస్ (90వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఈ సీజన్లు 30 మ్యాచ్‌లు ఆడిన హ్యారీ కేన్ 25 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. సీజన్‌లోని చివరి మ్యాచ్ మే 17న హఫెన్హీమ్ జట్టుతో బాయెర్న్ మ్యూనిక్ జట్టు ఆడుతుంది.మొత్తం 18 జట్లు ఇంటా, బయట పద్ధతిలో బుండెస్‌లీగాలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు 34 మ్యాచ్‌లు ఆడుతుంది. 33 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బాయెర్న్ మ్యూనిక్ జట్టు 24 విజయాలు సాధించింది. 7 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 95 గోల్స్ సాధించి, 32 గోల్స్‌ను సమర్పించుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 79 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను ఖరారు చేసుకుంది.68 పాయింట్లతో బాయెర్ 04 లెవెర్కుసెన్ జట్టు రన్నరప్ ట్రోఫీని ఖరారు చేసుకుంది. 31 హ్యారీ కేన్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు 2021, 2024 ‘యూరో’ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచింది. హ్యారీ కేన్ సభ్యుడిగా ఉన్న టోటెన్హామ్ హాట్స్పర్ క్లబ్ జట్టు 2015, 2019లలో ఇంగ్లిష్ ఫుట్‌బాల్ లీగ్ కప్‌లో రన్నరప్‌గా... 2019 చాంపియన్స్ లీగ్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2023లో కేన్ సభ్యుడిగా ఉన్న బాయెర్న్ మ్యూనిక్ జట్టు జర్మన్ సూపర్ కప్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దాంతో ఆరుసార్లు హ్యారీ కేన్‌కు టైటిల్ దక్కినట్టే దక్కి చేజారిపోయింది. అయితే ఏడో ప్రయత్నంలో హ్యారీ కేన్ ఖాతాలో బుండెస్లీగా రూపంలో మేజర్ టైటిల్ చేరింది.