
లీడ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 24.3 ఓవర్లలో కేవలం 131 పరుగులకే ఆలౌటైంది. సఫారీ బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముఖ్యంగా ప్రోటీస్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
అతడి స్పిన్ మయాజాలానికి మిడిలార్డర్ కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో 5.3 ఓవర్లు బౌలింగ్ చేసిన మహారాజ్.. కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు వియాన్ ముల్డర్ కూడా నిప్పులు చేరిగాడు. ముల్డర్ 7 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.
వీరిద్దరితో పాటు లుంగీ ఎంగిడీ, బర్గర్ తలా వికెట్ సాధించారు. ఓ వికెట్ రనౌట్ రూపంలో లభించింది. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ జేమీ స్మిత్(54) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మొత్తం ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు.
కెప్టెన్ హ్యారీ బ్రూక్(15), జోస్ బట్లర్(15) , డకెట్(7) తమ మార్క్ చూపించలేకపోయారు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా విఫలమైన ఇంగ్లండ్ పలు చెత్త రికార్డులను తమ పేరిట లిఖించుకుంది. హెడింగ్లీ మైదానంలో వన్డేల్లో ఇంగ్లండ్ చేసిన రెండో అత్యల్ప స్కోర్ ఇది. ఇంతకుముందు ఈ మైదానంలో 1975 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై 93 పరుగులకు ఆలౌటైంది. మళ్లీ ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత అత్యల్ప స్కోర్‌ను ఇంగ్లండ్ నమోదు చేసింది.
చదవండి: అతడు కొడితే సెంచరీలు.. లేదంటే చీప్‌గా ఔట్ అవుతాడు: ఇర్ఫాన్ పఠాన్