
ఆసియాకప్-2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఓపెనర్ ఎవరన్నది? ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఒక ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఖాయం కాగా.. మరో స్ధానం కోసం శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొంది.
గత 12 నెలలుగా సంజూ భారత జట్టుకు ఓపెనర్ గా ఉన్నాడు. అయితే టీ20ల్లో గిల్‌కు విశ్రాంతి ఇవ్వడంతోనే ఓపెనర్‌గా శాంసన్‌కు అవకాశం లభించింది. ఇప్పుడు గిల్ టీ20 జట్టులోకి తిరిగి రావడంతో శాంసన్ పరిస్థితి ఏంటో ఆర్ధం కావడం లేదు.
శాంసన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికి తుది జట్టు కూర్పులో పక్కన పెట్టే అవకాశముంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌కు మిడిలార్డర్‌లో మంచి రికార్డు లేదు. దీంతో అతడి స్ధానంలో జితేష్ శర్మకు చోటు దక్కే సూచనలు కన్పిస్తున్నాయి.
జితేష్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శలను చేశాడు. అతడు ఫినిషర్‌గా, వికెట్ కీపర్‌గా సేవలను అందించగలడు. అతడి వైపే టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌కు భారత తుది జట్టులో సంజూకు చోటు దక్కడం కష్టమేనని పఠాన్ అభిప్రాయపడ్డాడు.
"సంజూ శాంసన్ ఓపెనర్‌గా బాగా రాణించాడు. కానీ అతడి స్ధిరత్వంపై అందరికి సందేహం ఉంది. ఎందుకంటే అతడు చేస్తే సెంచరీలు చేస్తాడు లేదా చీప్‌గా ఔట్ అవుతాడు. బంగ్లాదేశ్ సిరీస్‌లో అద్బుతంగా రాణించిన సంజూ.. ఇంగ్లండ్‌పై పూర్తిగా తేలిపోయాడు.
అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో అభిషేక్ శర్మ స్ధానానికి ఎటువంటి ఢోకా లేదు. అభిషేక్ అద్బుతమైన స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. బౌలింగ్ కూడా చేయగలడు. అభిషేక్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. ప్రస్తుతం బీసీసీఐ ఆల్‌ఫార్మాట్ కెప్టెన్ కోసం వెతుకుతోంది.
అందుకే గిల్ ఏడాది తర్వాత అనూహ్యంగా టీ20 సెటాప్‌లోకి వచ్చాడు. కాబట్టి తుది జట్టులో గిల్‌కు అవకాశమిచ్చేందుకు సంజూను పక్కన పెట్టచ్చు. అప్పటికి శాంసన్‌ను ఆడించాలంటే ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలి.
ఒకవేళ అదే జరిగితే జితేష్ శర్మ బెంచ్‌కు పరిమితవ్వాల్సిందే. అయితే సంజూను మిడిలార్డర్‌లో ఆడించి టీమ్ మెనెజ్‌మెంట్ రిస్క్ తీసుకుంటుందో లేదో వేచి చూడాలి" అని సోనీ స్పోర్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
చదవండి: ‘ధోని సహనం కోల్పోయాడు.. నా మీద గట్టిగా అరిచాడు.. వికెట్ తీసినా సరే’