
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. అభిమానులు అతడిని ముద్దుగా ‘కెప్టెన్ కూల్ (Captain Cool)’ అని కూడా పిలుచుకుంటారు. మైదానంలో సంయమనం కోల్పోకుండా.. అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో ధోని దిట్ట. హడావుడి లేకుండా.. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేసి మ్యాచ్‌ను తమ జట్టు వైపునకు తిప్పడంలో తను తానే సాటి.
ఏదేమైనా మైదానంలో ధోని సహనం కోల్పోయిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పవచ్చు. అయితే, తన విషయంలో మాత్రం తలా.. తన స్వభావానికి భిన్నంగా ప్రవర్తించాడని భారత మాజీ క్రికెటర్ మోహిత్ శర్మ (Mohit Sharma) అంటున్నాడు.
చేదు అనుభవం
వన్డే వరల్డ్‌కప్-2015 సందర్భంగా టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించే క్రమంలో మోహిత్ శర్మ.. ధోనితో డ్రెసింగ్‌రూమ్ పంచుకున్నాడు. తలా సారథ్యంలో మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో ధోనితో తనకు మంచి అనుబంధం ఉందంటూనే మోహిత్ శర్మ.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని కూడా పంచుకున్నాడు.

చాంపియన్స్ లీగ్ టోర్నీలో సీఎస్‌కే తరఫున కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ధోని సారథ్యంలో ఆడాడు మోహిత్ శర్మ. నాడు జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ.. ‘‘మహీ భాయ్‌తో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కూల్ అండ్ కామ్ అని ఆయనకు పేరు. ఆయన సహనం కోల్పోతాడని మనం ఊహించలేము కూడా!
నాపై గట్టిగా అరిచాడు.. వికెట్ తీసినా తిడుతూనే
అయితే, ఓ యువకుడిపై ఆయన సహనం కోల్పోయి అరిస్తే.. నా విషయంలోనే ఇది జరిగింది. చాంపియన్స్ లీగ్ టీ20లో భాగంగా కేకేఆర్‌తో మ్యాచ్ జరుగుతున్నపుడు.. మహీ భాయ్ ఈశ్వర్ పాండేని బౌలింగ్‌కు పిలిచాడు.
నేనేమో నన్నే పిలిచాడనుకుని.. బౌలింగ్ చేసేందుకు రన్ కూడా మొదలుపెట్టాను. దాంతో మహీ భాయ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నన్ను తిట్టేశాడు. అయితే, ఆరోజు మొదటి బంతికే నేను యూసఫ్ పఠాన్ భాయ్ వికెట్ తీశాను.
దీంతో గట్టిగా సెలబ్రేట్ చేసుకున్నా. అప్పటికి ఇంకా మహీ భాయ్ నా మీద అరుస్తూనే ఉన్నాడు (నవ్వులు). భాయ్‌తో నాకు మైదానం వెలుపలా మంచి అనుబంధం ఉంది.
కేవలం ఆట గురించే కాదు..
కేవలం ఆట గురించే కాకుండా జీవిత పాఠాలను కూడా చక్కగా చెప్తాడు. క్రికెట్ కారణంగా ఓ ఆటగాడు మంచి వ్యక్తిగా కూడా ఎలా మారవచ్చో వివరిస్తాడు. ఆయనతో కలిసి కూర్చుంటే సమయమే తెలియదు’’ అని మోహిత్ శర్మ క్రిక్‌ట్రాకర్‌కు వెల్లడించాడు.
కాగా హర్యానాకు చెందిన 36 ఏళ్ల మోహిత్ శర్మ.. రైటార్మ్ పేసర్. 2013లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ బౌలర్.. 2015లో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రెండేళ్లకాలంలో అంతర్జాతీయ స్థాయిలో 26 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడిన మోహిత్ శర్మ.. 31, ఆరు వికెట్లు తీశాడు.
చదవండి: ‘ది హండ్రెడ్’లో ఇరగదీశారు.. ఆ నలుగురికి ఐపీఎల్‌లో భారీ ధర!