టీమిండియాతో టెస్టు సిరీస్ (IND vs SA Tests)కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. తమ కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని.. భారత్‌లో సఫారీ జట్టుకు సారథ్యం వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బవుమా కెప్టెన్సీలో టీమిండియాతో టెస్టులు ఆడబోయే జట్టులో పదిహేను మందికి చోటు ఇచ్చినట్లు సోమవారం వెల్లడించింది.
భారత్‌తో రెండు టెస్టులు
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్టుల్లో తలపడనుంది. భారత్ వేదికగా జరిగే ఈ సిరీస్ నిర్వహణకు నవంబరు 14- 26 వరకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన జట్టును ప్రొటిస్ బోర్డు తాజాగా ప్రకటించింది.
ఇటీవల పాకిస్తాన్‌లో పర్యటించిన జట్టులో స్వల్ప మార్పులతోనే టీమిండియాతోనూ సఫారీలు బరిలో దిగనున్నారు. బవుమా తిరిగి రావడంతో డేవిడ్ బెడింగ్‌హామ్ జట్టులో చోటు కోల్పోయాడు. కాగా పాక్‌తో ఇటీవల సౌతాఫ్రికా జట్టు రెండు టెస్టులు ఆడింది.
పాక్‌తో టెస్టు సిరీస్ సమం
బవుమా గైర్హాజరీలో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో డబ్ల్యూటీసీ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సౌతాఫ్రికా.. అనూహ్య రీతిలో పాక్‌తో తొలి టెస్టులో ఓడింది. ఆ తర్వాత రావల్పిండి వేదికగా రెండో టెస్టు గెలిచి సిరీస్‌ను 1-1 సమం చేయగలిగింది. త
తదుపరి పాక్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడిన తర్వాత సౌతాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో బాగంగా టీమిండియాతో తొలుత రెండు టెస్టులు ఆడనున్న సఫారీలు.. తదుపరి మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనున్నారు.
విండీస్‌ను వైట్‌వాష్ చేసిన టీమిండియా
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో ఓటమి చవిచూసింది. తదుపరి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ పూర్తి చేసుకుని.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడనుంది.
ఇక డబ్ల్యూటీసీ తాజా సీజన్‌లో గిల్ సేన తొలుత ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసి జోరు మీదుంది.
టీమిండియాతో టెస్టులకు సౌతాఫ్రికా జట్టు ఇదే
తెంబా బవుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైలీ వెరెన్నె, డెవాల్డ్ బ్రెవిస్, జుబేర్ హంజా, టోనీ డీ జోర్జి, కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, సెనురాన్ ముత్తుస్వామి, కగిసో రబడ, సైమన్ హార్మర్.
చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!


