
ఒప్పందం రద్దు చేసుకున్న బీసీసీఐ
స్పాన్సర్‌షిప్‌పై టయోటా ఆసక్తి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌షిప్ నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ 11’ను తప్పించారు. డ్రీమ్ ఎలెవన్‌తో ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకుంటున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. మూడేళ్ల కాలానికి 2023లో రూ.358 కోట్లతో డ్రీమ్ 11 ఒప్పందం కుదుర్చుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్’ ప్రకారం ఇకపై ‘డ్రీమ్ 11’ తన కార్యకలాపాలు కొనసాగించే అవకాశం లేదు. దాంతో ఆరి్థకపరంగా ఆ కంపెనీకి భారం కావడంతో పాటు ప్రభుత్వం నిషేధించిన సంస్థతో ఒప్పందాన్ని కొనసాగించరాదని బోర్డు కూడా నిర్ణయించింది. ‘మాకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం డ్రీమ్ 11 లేదా అలాంటి ఏ గేమింగ్ కంపెనీతోనైనా బీసీసీఐ ఒప్పందాన్ని కొనసాగించదు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒప్పందం రద్దు చేయాల్సిందే. ప్రధాన స్పాన్సర్‌గా మరో కొత్త కంపెనీ కోసం ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రక్రియ ఇంకా ఆరంభ దశలోనే ఉంది’ అని సైకియా వెల్లడించారు. ‘డ్రీమ్ 11తో ఒప్పందం 2026 వరకు ఉంది. అయితే తాజా పరిణామాల్లో డ్రీమ్ 11 వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఉల్లంఘన అనే మాటే తలెత్తదని సైకియా చెప్పారు.
‘ప్రధాన స్పాన్సర్ పరిస్థితిని మేం అర్థం చేసుకోగలం. చెల్లింపుల ఉల్లంఘనలాంటివేమీ వర్తించవు కాబట్టి వారిపై ఎలాంటి జరిమానా కూడా విధించడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి అందరూ పాటించాల్సిందే. వారి వ్యాపారం దెబ్బ తినడమే కాదు, బీసీసీఐ లాభాలపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటిగా ఉన్న ‘మై సర్కిల్ 11’తో కూడా ఒప్పందం ముగియడం ఖాయమైంది. ‘మై సర్కిల్ 11’ ఏడాదికి రూ. 125 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 625 కోట్లతో బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆసియా కప్‌లోగా సాధ్యమేనా!
‘డ్రీమ్ 11’ తప్పుకోవడంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఆసియా కప్‌కు ముందే ఈ ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నా...అది సాధ్యం కాకపోవచ్చు. సెపె్టంబర్ 9 నుంచే టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొత్త స్పాన్సర్ కోసం ప్రకటన ఇచ్చి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి ఆసియా కప్‌లో టీమిండియా ప్రధాన స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇది మరింత ఆలస్యం అయితే వన్డే వరల్డ్ కప్‌లో మహిళల జట్టు కూడా స్పాన్సర్ లేకుండానే ఆడుతుంది.
భారత జట్టుతో జత కట్టేందుకు జపాన్‌కు చెందిన ప్రఖ్యాత మోటార్ కంపెనీ టయోటా ముందుకు వస్తున్నట్లు సమాచారం. టయోటా ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా ఉండటంతో పాటు ఆ్రస్టేలియా టీమ్‌తో కూడా సహ స్పాన్సర్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఫైనాన్షియల్ సర్విస్ కంపెనీ అయిన ‘ఫిన్‌టెక్’ కూడా ఆసక్తి చూపిస్తోంది. ఈ నేపథ్యంలో పలు కంపెనీల వద్ద పోటీ ఉండవచ్చు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. బోర్డు కూడా గత ఒప్పందంకంటే ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తోంది. నిజానికి ‘డ్రీమ్ 11’ లోగోతో కూడిన జెర్సీలతో భారత టీమ్ కిట్ సిద్ధంగా ఉంది. అయితే వీటిని వేసుకోరాదని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.