IPL 2023: ఆర్సీబీ గుండె బద్దలయ్యే వార్త.. గాయాల కారణంగా ఇద్దరు స్టార్లు ఔట్‌..!

Double Blow For RCB, Star Duos Participation In Serious Doubt For IPL 2023 - Sakshi

ఐపీఎల్‌ 2023 సీజన్‌ ప్రారంభానికి ముందు రాయల్‌ ఛాలెం​జర్స్‌ బెంగళూరు జట్టుకు గుండె బద్దలయ్యే లాంటి వార్త తెలిసింది. గత సీజన్‌లో సత్తా చాటిన ఇ‍ద్దరు స్టార్‌ ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ సీజన్‌కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. వన్డేల్లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బౌలర్‌, ఆసీస్‌ స్టార్‌ పేసర్‌, ఆర్సీబీ కీ బౌలర్‌ అయిన జోష్‌ హాజిల్‌వుడ్‌ మడమ సమస్య కారణంగా సీజన్‌ మొత్తానికే దూరమయ్యే ప్రమాదముండగా.. స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ సైతం మడమ గాయం కారణంగానే సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లు మిస్‌ అయ్యే అవకాశం ఉంది.

గాయం కారణంగా ఇటీవలే భారత్‌తో జరిగిన టెస్ట్‌, వన్డే సిరీస్‌ల్లో కూడా పాల్గొనని హాజిల్‌వుడ్‌.. గాయం నుంచి వేగంగా కోలుకుని కనీసం సీజన్‌ సెకెండ్‌ లెగ్‌ మ్యాచ్‌లకైనా అందుబాటులో ఉండాలని భావిస్తున్నాడు. ఒకవేళ హాజిల్‌వుడ్‌ సీజన్‌ మొత్తానికే దూరమైతే, ఆర్సీబీకి ఇది భారీ ఎదురుదెబ్బగా పరిగణించాలి. 2022 మెగా వేలంలో హాజిల్‌వుడ్‌ను ఆర్సీబీ రూ. 7.75 కోట్లకు సొంతం చేసుకుంది.

మరోవైపు, గత సీజన్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై సెంచరీ బాదిన ఆర్సీబీ హీరో రజత్‌ పాటిదార్‌.. గాయం కారణంగా ప్రస్తుతం ఎన్‌సీఏలోని రిహాబ్‌లో చికిత్స పొందుతున్నాడు. 2023 ఆర్సీబీ ట్రయినింగ్‌ క్యాంప్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు గాయం బారిన పడ్డ పాటిదార్‌.. సీజన్‌ ఫస్ట్‌ హాఫ్‌ మ్యాచ్‌లు మిస్‌ అయ్యే అవకాశం ఉంది. ఎన్‌సీఏ అధికారులు అతన్ని తదుపరి మూడు వారాలు రెస్ట్‌ తీసుకోవాలని సూచించారు.

ఎంఆర్‌ఐ స్కాన్‌ అనంతరం పాటిదార్‌ పరిస్థితిని మరోసారి సమీక్షించి, అతను ఐపీఎల్‌-2023 సెకెండ్‌ లెగ్‌లో పాల్గొనేది లేనిది తేలుస్తామని ఎన్‌సీఏ అధికారులు తెలిపారు. హాజిల్‌వుడ్‌, పాటిదార్‌లతో పాటు మరో స్టార్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. మ్యాక్సీ కూడా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇదే నిజమైతే, త్వరలో ప్రారంభమయ్యే సీజన్‌లోనూ ఆర్సీబీ వైఫల్యాల పరంపర కొనసాగే అవకాశం ఉంది. కాగా, ఏప్రిల్‌ 2న చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఆర్సీబీ క్యాంపెయిన్‌ ప్రారంభం కానుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top