అక్షర్‌ పటేల్‌ షాకింగ్‌ కామెంట్స్‌ | Delhi Capitals Out Of IPL 2026, Axar Patel Admits | Sakshi
Sakshi News home page

అక్షర్‌ పటేల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

May 9 2026 10:36 AM | Updated on May 9 2026 10:48 AM

Delhi Capitals Out Of IPL 2026, Axar Patel Admits

ఐపీఎల్‌ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు అంతమయ్యాయి. అయినా ఆ జట్టు టెక్నికల్‌గా ఇంకా రేసులో ఉంది. అయితే డీసీ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నిన్న (మే 8) కేకేఆర్‌ చేతిలో ఓటమి అనంతరం అక్షర్‌ మాట్లాడుతూ.. ఈ సీజన్‌కు మా పని అయిపోయిందన్నట్లు  వ్యాఖ్యానించాడు.  

ఈ వ్యాఖ్యలు డీసీ అభిమానులను తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్లే ఆఫ్స్‌ తలుపులు పూర్తిగా మూసుకోకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని వారు మండిపడుతున్నారు. చివరి నిమిషం వరకు పోరాడకుండా చేతులెత్తేస్తున్నట్లు ప్రకటించిన అక్షర్‌ను వెంటనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్షర్‌ వ్యాఖ్యలతో సహచర సభ్యులు కూడా షాకయ్యారు. అక్షర్‌ ఇలా అనేశాడేంటీ అని చెవులు కొరుక్కున్నారు.

వాస్తవానికి డీసీకి ప్లే ఆఫ్స్‌ చేరేందుకు ఇంకా తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు. ఆ జట్టు ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో భారీ విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నట్లే. అయితే అది ఇతర జట్ల జయాపజయాలు, రన్‌రేట్‌పై ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 7 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి, పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.

ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ (14), పంజాబ్‌ కింగ్స్‌ (13), ఆర్సీబీ (12), రాజస్థాన్‌ (12), గుజరాత్‌ (12), సీఎస్‌కే (10) పాయింట్ల పట్టికలో టాప్‌-6 జట్లుగా ఉండి, నాలుగు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఈ జట్లను కాదని డీసీకి (8) ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కడం కష్టమే అయినప్పటికీ.. అసాధ్యం​ మాత్రం కాదు.

గొప్పగా ప్రారంభించి..
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించింది. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్‌పై విజయాలతో ఆత్మవిశ్వాసం పెంచుకుంది. అయితే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం (కుల్దీప్ యాదవ్‌కు సింగిల్ ఇవ్వకపోవడం) తర్వాత జట్టు మూమెంటం పూర్తిగా కోల్పోయింది. ఆ తర్వాత 9 మ్యాచ్‌ల్లో 7 ఓటములు ఎదర్కొని నిష్క్రమణకు సమీపించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement