IPL 2021 RCBvsDC: బెంగళూరు బతికిపోయింది

DC vs RCB: Bangalore Beats Delhi By One Run - Sakshi

ఒక పరుగు తేడాతో ఢిల్లీపై విజయం

డివిలియర్స్‌ మెరుపు బ్యాటింగ్‌

హెట్‌మైర్, పంత్‌ శ్రమ వృథా

ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత ముగింపు. చివర్లో ఒత్తిడిని అధిగమించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కీలక విజయాన్ని అందుకుంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో భారీ ఓటమి తర్వాత కోహ్లి సేన మళ్లీ గెలుపు బాట పట్టి అగ్రస్థానానికి చేరింది. సాధారణ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో పేలవంగా ఆడిన ఢిల్లీ పీకల మీదకు తెచ్చుకుంది. చివర్లో హెట్‌మైర్, పంత్‌ తీవ్రంగా ప్రయత్నించినా ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు టాపార్డర్‌ విఫలమైనా... మరోసారి తనను నమ్ముకున్న జట్టును నిలబెడుతూ డివిలియర్స్‌ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఆర్‌సీబీ మెరుగైన స్కోరు సాధించి ప్రత్యర్థికి సవాల్‌ విసరగలిగింది.   

అహ్మదాబాద్‌: హోరాహోరీ పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పైచేయి సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఏబీ డివిలియర్స్‌ (42 బంతుల్లో 75 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... రజత్‌ పటిదార్‌ (22 బంతుల్లో 31; 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేయగలిగింది. రిషభ్‌ పంత్‌ (48 బంతుల్లో 58 నాటౌట్‌; 6 ఫోర్లు), షిమ్రాన్‌ హెట్‌మైర్‌ (25 బంతుల్లో 53 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు.

టాప్‌ తడబాటు... 
ఆర్‌సీబీ ఓపెనర్లు కోహ్లి (12; 2 ఫోర్లు), దేవదత్‌ పడిక్కల్‌ (17; 3 ఫోర్లు) మరోసారి చక్కటి ఆరంభం అందించినా దానిని కొనసాగించడంలో విఫలమయ్యారు. వరుస బంతుల్లో వీరిద్దరూ వెనుదిరిగారు. అవేశ్‌ ఖాన్‌ వేసిన బంతిని కోహ్లి వికెట్లపైకి ఆడుకోగా... ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో పడిక్కల్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో మ్యాక్స్‌వెల్‌ (20 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు) వెనుదిరగ్గా... మరో ఎండ్‌లో పటిదార్‌ కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడాడు. డివిలియర్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 54 పరుగులు (38 బంతుల్లో) జోడించిన అనంతరం అతను నిష్క్రమించాడు.  


పంత్, సిరాజ్, కోహ్లి 

ఏబీ జోరు... 
బెంగళూరును ఎప్పటిలాగే మరోసారి డివిలియర్స్‌ తన మెరుపు బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. నిలదొక్కుకునే వరకు జాగ్రత్తగా ఆడిన అతను ఆ తర్వాత చెలరేగాడు. అక్షర్, రబడ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌ కొట్టిన అతను, చివరి ఓవర్లో పండగ చేసుకున్నాడు. స్టొయినిస్‌ పేలవ బౌలింగ్‌ను సొమ్ము చేసుకుంటూ ఈ ఓవర్లో ఎక్స్‌ట్రా కవర్, షార్ట్‌ ఫైన్‌లెగ్, కవర్స్‌ దిశగా డివిలియర్స్‌ మూడు భారీ సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో 35 బంతుల్లోనే ఏబీ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆఖరి ఓవర్లో మొత్తం 23 పరుగులు రావడంతో చాలెంజర్స్‌ మెరుగైన స్కోరు వద్ద ముగించగలిగింది.  

ఇసుక తుఫాను... 
ఐపీఎల్‌ మ్యాచ్‌ విరామం సమయంలో నరేంద్ర మోదీ స్టేడియాన్ని ఇసుక తుఫాన్‌ ముంచెత్తింది. వేగంగా గాలులు వీచడంతో పాటు దుమ్మూ ధూళి ఎగసిపడి చాలా సేపు ఇబ్బంది పెట్టాయి. బెంగళూరు ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత ఇది జరిగింది. దాంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ కాస్త ఆలస్యంగా మొదలైంది.  


హెట్‌మైర్‌  

హెట్‌మైర్‌ మెరుపులు... 
ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ (6)తో పాటు స్టీవ్‌ స్మిత్‌ (4)లను వెంటవెంటనే అవుట్‌ చేసి ఢిల్లీపై ఆర్‌సీబీ ఒత్తిడి పెంచింది. పృథ్వీ షా (18 బంతుల్లో 21; 3 ఫోర్లు) ఎక్కువ ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో పంత్, స్టొయినిస్‌ (17 బంతుల్లో 22; 3 ఫోర్లు) కలిసి క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే బెంగళూరు బౌలర్లు కట్టడి చేయడంతో స్కోరు వేగంగా సాగలేదు. జోరు పెంచే ప్రయత్నంలో స్టొయినిస్‌ కూడా వెనుదిరిగాడు. విజయం కోసం 44 బంతుల్లో 80 పరుగులు చేయాల్సిన ఇలాంటి దశలో పంత్, హెట్‌మైర్‌ జత కలిశారు. పంత్‌ తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లు ఆడటంలో తడబడగా... హెట్‌మైర్‌ చెలరేగిపోయాడు. సిరాజ్‌ ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టిన హెట్‌మైర్‌ జేమీసన్‌ ఓవర్లో చితక్కొట్టాడు. ఈ ఓవర్లో అతను మూడు భారీ సిక్సర్లు బాదడం విశేషం. ఫలితంగా ఢిల్లీ లక్ష్యం 12 బంతుల్లో 25 పరుగులకు చేరింది. హర్షల్‌ వేసిన 19వ ఓవర్లో ఢిల్లీ 11 పరుగులు రాబట్టగలిగింది.  

రక్షించిన సిరాజ్‌... 
ఆఖరి ఓవర్లో క్యాపిటల్స్‌ విజయానికి 14 పరుగులు కావాలి. ఐపీఎల్‌లో లెక్కలేనన్ని సార్లు ఎందరో బ్యాట్స్‌మెన్‌ దీనిని చేసి చూపించారు కాబట్టి అసాధ్యమేమీ కాదు. తీవ్ర ఒత్తిడిలో ఈ ఓవర్‌ వేసిన సిరాజ్‌ చక్కటి బంతులతో ఇద్దరు విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసి జట్టును గెలిపించాడు. తొలి నాలుగు బంతుల్లో అతను 4 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆఖరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతిని పంత్‌ ఫోర్‌ బాదడంతో చివరి బంతికి సిక్స్‌ కొడితే గానీ ఢిల్లీ గెలవలేని స్థితి. ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా సిరాజ్‌ వేసిన బంతిని వెంటాడి పంత్‌ పాయింట్‌ దిశగా ఫోర్‌ కొట్టగలిగినా అది సరిపోలేదు.  

స్కోరు వివరాలు  
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) అవేశ్‌ 12; పడిక్కల్‌ (బి) ఇషాంత్‌ 17; పటిదార్‌ (సి) స్మిత్‌ (బి) అక్షర్‌ 31; మ్యాక్స్‌వెల్‌ (సి) స్మిత్‌ (బి) మిశ్రా 25; డివిలియర్స్‌ (నాటౌట్‌) 75; సుందర్‌ (సి అండ్‌ బి) రబడ 6; స్యామ్స్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–30, 2–30, 3–60, 4–114, 5–139. బౌలింగ్‌: ఇషాంత్‌ 4–1–26–1, రబడ 4–0–38–1, అవేశ్‌ 4–0–24–1, మిశ్రా 3–0–27–1, అక్షర్‌ 4–0–33–1, స్టొయినిస్‌ 1–0–23–0.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) డివిలియర్స్‌ (బి) హర్షల్‌ 21; ధావన్‌ (సి) చహల్‌ (బి) జేమీసన్‌ 6; స్మిత్‌ (సి) డివిలియర్స్‌ (బి) సిరాజ్‌ 4; పంత్‌ (నాటౌట్‌) 58; స్టొయినిస్‌ (సి) డివిలియర్స్‌ (బి) హర్షల్‌ 22; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 53; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 170.  
వికెట్ల పతనం: 1–23, 2–28, 3–47, 4–92. బౌలింగ్‌: స్యామ్స్‌ 2–0–15–0, సిరాజ్‌ 4–0–44–1, జేమీసన్‌ 4–0–32–1, సుందర్‌ 4–0–28–0, హర్షల్‌ 4–0–37–2, చహల్‌ 2–0–10–0.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top