AUS VS ENG 3rd ODI: సుదీర్ఘ నిరీక్షణ.. కోహ్లికి 1021, వార్నర్‌కు 1043 రోజులు

David Warner Scored International Century After 1043 Days, While Kohli Took 1021 Days - Sakshi

క్రికెట్‌ చరిత్రలో గతం ఘనంగా ఉండి, సెంచరీ కోసం సుదీర్ఘకాలం పాటు నిరీక్షించిన క్రికెటర్లు ఎవరంటే.. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పేర్లు ఇట్టే చెబుతారు. అంతర్జాతీయ కెరీర్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లి.. 71వ శతకం కోసం 1021 రోజులు నిరీక్షించగా, 43 సెంచరీలు బాదిన వార్నర్‌.. 44వ శతకం కోసం ఏకంగా 1043 రోజుల పాటు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాడు.

తమ తమ కెరీర్లలో దశాబ్దకాలం పాటు మకుటం లేని మహరాజుల్లా ఓ వెలుగు వెలిగిన ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు.. ఒక్క సెంచరీ కోసం దాదాపు మూడేళ్ల పాటు ఎదురుచూశారు. ఈ మధ్యలో ఎన్నో అవమానాలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలు ఎదుర్కొన్న వీరు.. ఎట్టకేలకు గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి తామేంటో ప్రపంచానికి రుజువు చేశారు. 

కోహ్లి.. ఆసియా కప్‌-2022లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తన సెంచరీ నిరీక్షణకు తెరదించగా.. ఇవాళ (నవంబర్‌ 22) ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో వార్నర్‌ శతక దాహాన్ని (వన్డేల్లో 19వ శతకం) తీర్చుకున్నాడు. 

ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడో వన్డేలో ఆసీస్‌ 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (130 బంతుల్లో 152; 16 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (102 బంతుల్లో 106; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో ఆసీస్‌ 48 ఓవర్లలో (వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు) 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది. 

అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం ఇంగ్లండ్‌కు 48 ఓవర్లలో 364 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఆ జట్టు 31.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటై, భారీ తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆసీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేలు ఆస్ట్రేలియా జట్టే విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top