దూసుకువస్తున్న బ్యాటింగ్‌ ‘బుల్లెట్‌’.. దేశీ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌! | Duleep Trophy 2025-26: Danish Malewar’s 198* Puts Central Zone on Top Against North East | Sakshi
Sakshi News home page

దూసుకువస్తున్న బ్యాటింగ్‌ ‘బుల్లెట్‌’.. దేశీ క్రికెట్‌లో నయా సెన్సేషన్‌!

Aug 28 2025 5:46 PM | Updated on Aug 28 2025 5:56 PM

Danish Malewar 198 Not Out Rise after Duleep Trophy ton Could be One For Future

భారత దేశీ క్రికెట్‌ నూతన సీజన్‌కు గురువారం తెరలేచింది. డొమెస్టిక్‌ సీజన్‌ 2025-26లో భాగంగా దులిప్‌ ట్రోఫీ (Duleep Trophy) టోర్నమెంట్‌ బెంగళూరు వేదికగా మొదలైంది. ఈ రెడ్‌బాల్‌ టోర్నీ తొలి క్వార్టర్‌ ఫైనల్లో భాగంగా నార్త్‌ జోన్‌- ఈస్ట్‌ జోన్‌ తలపడుతుండగా.. రెండో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సెంట్రల్‌ జోన్‌- నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో పోటీపడుతోంది.

సెంట్రల్‌ జోన్‌ భారీ స్కోరు
అయితే, వర్షం కారణంగా కాస్త ముందుగానే తొలిరోజు ఆట ముగిసింది. తొలి క్వార్టర్‌ ఫైనల్లో నార్త్‌ జోన్‌ 75.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఇక రెండో క్వార్టర్‌ ఫైనల్లో టాస్‌ గెలిచిన నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. సెంట్రల్‌ జోన్‌ భారీ స్కోరు సాధించింది.

డానిష్‌ మలేవర్‌ అద్భుత ఇన్నింగ్స్‌
ఓపెనర్లలో ఆయుశ్‌ పాండే (Ayush Panday- 3) విఫలమైనా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆర్యన్‌​ జుయాల్‌ అర్ధ శతకంతో మెరిశాడు. వంద బంతులు ఎదుర్కొన్న అతడు 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో జట్టును నిలబెట్టే బాధ్యత తీసుకున్న వన్‌డౌన్‌ బ్యాటర్‌ డానిష్‌ మలేవర్‌ (Danish Malewar) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

35 ఫోర్లు, ఒక సిక్సర్‌.. 198 పరుగులు
తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి 219 బంతులు ఎదుర్కొన్న ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. ఏకంగా 35 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 198 పరుగులు సాధించాడు. డబుల్‌ సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ కూడా విధ్వంసకర శతకం (96 బంతుల్లో 125)తో దుమ్ములేపాడు.

ఇక యశ్‌ రాథోడ్‌ 32 పరుగులతో.. మాలేవర్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా గురువారం నాటి ఆట ముగిసే సరికి 77 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి సెంట్రల్‌ జోన్‌ 432 పరుగులు చేసింది. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ బౌలర్లలో ఆకాశ్‌ చౌదరి, ఫిరోయిజమ్‌ జాటిన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

దూసుకువచ్చిన నయా బుల్లెట్‌.. డానిష్‌ మలేవర్‌
దేశీ క్రికెట్‌లో ఛతేశ్వర్‌ పుజారా పరుగుల వరద పారించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఈ సౌరాష్ట్ర బ్యాటర్‌ రికార్డు స్థాయిలో 66 శతకాల సాయంతో 21,301 పరుగులు సాధించాడు. ఇటీవలే పుజారా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వైదొలిగాడు.

అయితే, ప్రస్తుతం చాలా మంది యువ క్రికెటర్లు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కానీ.. అందరికీ టీమిండియా తలుపులు తట్టే అవకాశం రాకపోవచ్చు. కానీ విదర్భకు చెందిన డానిష్‌ మలేవర్‌ మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాడు.

భారీ సెంచరీ
తన తొలి ఫస్ట్‌క్లాస్‌ సీజన్‌లోనే మలేవర్‌ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 783 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, ఆరు ఫిఫ్టీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్‌రేటు 51. తాజాగా మరో భారీ సెంచరీని మలేవర్‌ సాధించాడు. దానిని డబుల్‌ సెంచరీగా మార్చడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ‘నయా వాల్‌’ పుజారాకు వారసుడయ్యే లక్షణాలు మలేవర్‌లో దండిగా ఉన్నాయంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడే ఇలా అనడం తొందరపాటు చర్యే అయినా.. నిలకడగా అతడు ముందుకు సాగితే అదే నిజమవుతుందని విశ్లేషకులు అంటున్నారు. నాగ్‌పూర్‌లో జన్మించిన 21 ఏళ్ల డానిష్‌ మలేవర్‌.. కుడిచేతి వాటం బ్యాటర్‌. అదే విధంగా.. రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ కూడా!

చదవండి: పొట్టివాళ్లే గొప్ప బ్యాటర్లు... సచిన్‌, కోహ్లి ఇందుకు ఉదాహరణ: ద్రవిడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement