
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు తడబడింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానంలో గురువారం ప్రారంభమైన తుదిపోరులో సెంట్రల్‌జోన్ బౌలర్లు విజృంభించారు.
ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 63 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ రంజీ ప్లేయర్ తన్మయ్ అగర్వాల్ (76 బంతుల్లో 31; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నిజార్ (52 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ శర్మ (64 బంతుల్లో 20; 2 ఫోర్లు) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు.
వికెట్ నష్టపోకుండా 50 పరుగులు
సెంట్రల్ జోన్ ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్ 24 ఓవర్లలో 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... ఎడంచేతి వాటం స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ 53 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సెంట్రల్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది.
ఈ సీజన్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న దానిశ్ మాలేవర్ (64 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 ఫోర్లు), అక్షయ్ వాడ్కర్ (52 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న సెంట్రల్ జోన్... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 99 పరుగులు వెనుకబడి ఉంది.
స్పిన్‌కు విలవిల...
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ జట్టుకు ఏదీ కలిసిరాలేదు. సెంట్రల్ జోన్ స్పిన్‌ను తట్టుకోలేక సౌత్‌జోన్ ప్లేయర్లు విలవిలలాడారు. హైదరాబాదీ తన్మయ్ అగర్వాల్ ఒక్కడే కాస్త పోరాడగా... మరో ఓపెనర్ మోహిత్ కాలే (50 బంతుల్లో 9), రవిచంద్రన్ స్మరణ్ (19 బంతుల్లో 1) క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా పరుగులు సాధించలేకపోయారు.
ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (53 బంతుల్లో 15; 2 ఫోర్లు) గంటకు పైగా క్రీజులో ఉన్నా పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డాడు. కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ (4) విఫలం కాగా... అండ్రె సిద్ధార్థ్ (12) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. సల్మాన్, అంకిత్ తలా కొన్ని పరుగులు చేయడంతో సౌత్ జోన్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.
దీపక్ చహర్ విఫలం
సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా బౌలర్ దీపక్ చహర్ ఆరు ఓవర్లకే పరిమితం కాగా... స్పిన్నర్లు చెలరేగిపోయారు. సారాంశ్ జైన్, కుమార్ కార్తికేయ కలిసి 45 ఓవర్లు వేసి 9 వికెట్లు పంచుకున్నారు.
మిగిలిన ఒక్క వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. కార్తికేయ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో నిర్లక్ష్యంగా స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మోహిత్ క్లీన్ బౌల్డ్ కాగా... ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. లంచ్ సమయానికే సౌత్ జోన్ 4 వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత కూడా ఏమాత్రం ఆటతీరు మార్చుకోలేకపోయింది. దీనికి తోడు పరుగు తీసే క్రమంలో రికీ భుయ్‌తో సమన్వయలోపం కారణంగా తన్మయ్ అగర్వాల్ రనౌట్ కావడం జట్టును మరింత దెబ్బతీసింది.
స్కోరు వివరాలు
సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (రనౌట్) 31; మోహిత్ కాలే (బి) కార్తికేయ 9; స్మరణ్ (సి) సారాంశ్ జైన్ (బి) కార్తికేయ 1; రికీ భుయ్ (ఎల్బీ) (బి) సారాంశ్ జైన్15; అజహరుద్దీన్ (బి) కార్తీకేయ 4; సల్మాన్ నిజార్ (సి) పాటీదార్ (బి) సారాంశ్ జైన్ 24; సిద్ధార్థ్ (స్టంప్డ్) ఉపేంద్ర యాదవ్ (బి) సారాంశ్ 12; అంకిత్ శర్మ (ఎల్బీ) సారాంశ్ జైన్ 20; గురజపనీత్ సింగ్ (ఎల్బీ) కార్తికేయ 2; నిదీశ్ (సి అండ్ బి) సారాంశ్ జైన్ 12; వాసుకి కౌశిక్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (63 ఓవర్లలో ఆలౌట్) 149. వికెట్ల పతనం: 1–27, 2–35, 3–47, 4–57, 5–65, 6–97, 7–116, 8–129, 9–142, 10–149.
బౌలింగ్: దీపక్ చహర్ 6–1–11–0; ఆదిత్య ఠాకరే 4–2–7–0; కుల్దీప్ సేన్ 8–3–15–0; కుమార్ కార్తికేయ 21–1–53–4; సారాంశ్ జైన్ 24–2–49–5.
సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: దానిశ్ మాలేవర్ (బ్యాటింగ్) 28; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 50. బౌలింగ్: గుర్‌జపనీత్ సింగ్ 4–1–21–0; అంకిత్ శర్మ 8–1–22–0; నిధీశ్ 3–1–6–0; వాసుకి కౌశిక్ 4–3–1–0.