
వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేర్లలో డ్వాన్ బ్రావో (Dwayne Bravo) పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక పొట్టి క్రికెట్‌లో తనకు తానే సాటి అనిపించుకున్న బ్రావో.. ఏకంగా పదిహేను ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడాడు.
తనకు తానే సాటి
కేవలం ఆటకే పరిమితం కాకుండా.. మైదానం వెలుపల సంగీతం, నృత్యంతో ఆ ఆల్‌రౌండర్ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. క్రికెట్ హిస్టరీలో తన కంటూ ప్రత్యేక పుటల్ని లిఖించుకున్న బ్రావోకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఆల్‌టైమ్ రికార్డు
ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. టీ20 చరిత్రలో 500 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా ఆల్‌టైమ్ రికార్డు సాధించాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్టు అయిన బ్రావో.. బ్యాటర్‌గా పవర్ హిట్టింగ్ చేయగలడు. ఆల్‌రౌండర్‌గా అద్భుతమైన నైపుణ్యాలు కలిగి ఉన్న బ్రావో.. గాయాల బెడద, వెస్టిండీస్ బోర్డుతో విభేదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.
సీఎస్‌కే బౌలింగ్ కోచ్‌గానూ
అయితే, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ముఖ్యంగా ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేశాడు బ్రావో. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించిన బ్రావో.. 2015, 2016 సీజన్లలో వరుసగా 32, 26 వికెట్లు తీసి సత్తా చాటాడు. తర్వాత సీఎస్‌కే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రావో.. 2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చేరాడు.
పెళ్లి కాకుండానే ముగ్గురు పిల్లలు..
అలుపెరుగని ఆల్‌రౌండర్‌గా పేరొందిన బ్రావో క్రికెట్ విజయాల గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, అతడి వ్యక్తిగత జీవితం గురించి మాత్రం కొందరికే తెలుసు. 42 ఏళ్ల బ్రావో ఇంత వరకు అధికారికంగా వివాహ బంధంలో అడుగుపెట్టలేదు.
అయితే, ముగ్గురు పిల్లలకు మాత్రం తండ్రి అయ్యాడు. వేర్వేరు మహిళల ద్వారా ముగ్గురు సంతానానికి జన్మనిచ్చాడు. బ్రావోకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె డ్వేనిస్ కాగా.. పెద్ద కుమారుడి పేరు డ్వేన్ బ్రావో జూనియర్. మూడో పిల్లాడి పేరు ఇంత వరకు బహిర్గతం కాలేదు.
వారితో ఇప్పటికీ టచ్‌లోనే..
లౌ అనే మహిళతో తాను మొదటి కుమారుడికి జన్మనిచ్చినట్లు బ్రావో సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలియజేశాడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక ఖితా గోన్‌సాల్వ్స్‌తో పాటు.. మరో మహిళతో కలిసి బ్రావోకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఆమెకు బ్రేకప్
ఇక 2017 నుంచి మిస్ బార్బడోస్ వరల్డ్ రెజీనా రమ్‌జిత్‌తో ప్రేమలో ఉన్న బ్రావో.. ఇటీవలే ఆమెతో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఏదేమైనా తన ముగ్గురు పిల్లల తల్లులతో బ్రావో ఇప్పటికీ మంచి అనుబంధమే కలిగి ఉన్నాడు. వివిధ కార్యక్రమాలకు తన మాజీ భాగస్వాములు పిల్లలతో కలిసి హాజరయ్యే అతడు.. మదర్స్ డే సందర్భంగా ముగ్గురితో కలిసి ఉన్న ఫొటోలు పంచుకున్నాడు.
సంస్కృతిలోనే అదొక భాగం అనుకుంటా
కాగా.. బ్రావో గురించి సీఎస్‌కేలో అతడి మాజీ సహచర ఆటగాడు దీపక్ చహర్ అప్పట్లో సరదాగా చేసిన వ్యాఖ్యలు తాజాగా తెర మీదకు వచ్చాయి. ‘‘ప్రతీ ఐపీఎల్ సీజన్ తర్వాత బ్రావో కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను కలిగి ఉంటాడేమో!.. వెస్టిండీస్ సంస్కృతిలోనే అదొక భాగం అనుకుంటా’’ అని జోక్ పేల్చాడు. కాగా విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్.. బాలీవుడ్ నటి నీనా గుప్తాతో కుమార్తె మసాబాను కలిగి ఉన్న విషయం తెలిసిందే.
అయితే, వీరి ప్రేమకథ సుఖాంతం కాలేదు. నీనాను పెళ్లి చేసుకోకుండానే బిడ్డను కన్న రిచర్డ్స్.. తర్వాత ఆమెను వదిలేశాడు. సింగిల్ మదర్‌గా మసాబాను పెంచిన నీనా.. ఆమెను ఫ్యాషన్ డిజైనర్‌గా తీర్చిదిద్దింది.
చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60 ఏళ్లు.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే!