భారత మహిళల క్రికెట్ భవిష్యత్తుపై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ వ్యాఖ్య
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేలు, టి20 ఫార్మాట్‌లు కలిపి మూడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. సెమీఫైనల్ దశలో కూడా ఎదురైన పరాజయాలు ఉన్నాయి. చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చినా అసలు విజయం మాత్రం దక్కలేదు. అయితే ఇప్పుడు దక్కిన ప్రపంచ కప్‌తో భవిష్యత్తులో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తుందని కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది.
‘మేం మంచి క్రికెట్ ఆడుతున్నామని ఎన్నో ఏళ్లుగా చాలాసార్లు ప్రశంసలు వచ్చాయి. అయితే ఒక పెద్ద విజయం లేకుండా ఇలాంటి మాటలన్నీ వృథా అని మాకు బాగా తెలుసు. అలాంటి గెలుపు వస్తేనే మార్పు గురించి మాట్లాడాలి. దీని కోసం ఎంతగానో ఎదురు చూశాం. ప్రతీ టోర్నీ ముగియగానే నేను, స్మృతి బాధతో ఇంటికి వెళ్లిపోవడం, నిశ్శబ్దంగా కొద్ది రోజులు గడపడం, ఆపై తిరిగొచ్చి మళ్లీ కొత్తగా మొదలుపెట్టడం జరిగేది.
దీనికి ముగింపు ఎప్పుడు అని మేం మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వాడుకున్నాం. నా ఆనందాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదు. నా జట్టును చూస్తే గర్వంగా ఉంది. ఈ విజయంతో ఇకపై మరిన్ని విజయాలకు ప్రేరణ అందడంతో పాటు మహిళల క్రికెట్ స్థాయి మరింత పెరగడం ఖాయం’ అని హర్మన్ చెప్పింది. లీగ్ దశలో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన తర్వాత తమలో మరింత కసి పెరిగిందని, అదే తర్వాతి మ్యాచ్‌లలో కనిపించిందని హర్మన్ పేర్కొంది.
‘ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మా ఆలోచనా ధోరణి మారింది. వ్యూహాలు కూడా మార్చాలని, కొత్తగా మొదలు పెట్టాలని అర్థమైంది. ఆ ఓటమి ప్రభావం అందరిపై పడింది. ఇన్నేళ్లుగా సిద్ధమై ఇలా ఎలా ఓడామని అంతర్మథనం జరిగింది. ఫలితంగా పట్టుదల పెరిగి మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించాం’ అని కెపె్టన్ వెల్లడించింది. తమపై తమకు ఉన్న నమ్మకం, ఆత్మవిశ్వాసం కారణంగానే ఫైనల్లో విజయం దక్కిందని హర్మన్ అభిప్రాయపడింది.


