
దులీప్ ట్రోఫీ-2025 విజేతగా సెంట్రల్ జోన్ నిలిచింది. బెంగళూరు వేదికగా జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో సౌత్ జోన్‌ను చిత్తు చేసిన సెంట్రల్ జోన్.. ఏడోసారి దులీప్ ట్రోఫీ టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంతో తమ 11 ఏళ్ల నిరీక్షణకు సెంట్రల్ జోన్ తెరదించింది. రజత్ పాటిదార్ తన అద్బుత కెప్టెన్సీతో సెంట్రల్ జోన్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.
కాగా తుది పోరులో తొలి రోజు నుంచే సెంట్రల్ ఆధిపత్యం చెలాయించింది. సౌత్ జోన్ నిర్ధేశించిన 65 పరుగుల లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 149 పరుగులకే ఆలౌటైంది.
సెంట్రల్ జోన్ స్పిన్నర్లు శరన్ష్ జైన్ ఐదు వికెట్లతో మెరవగా.. శరన్ష్ జైన్ నాలుగు వికెట్లు సాధించాడు. సౌత్‌జోన్ ఇన్నింగ్స్‌లో తన్మయ్ అగర్వాల్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సల్మాన్ నిజార్(24), అంకిత్ శర్మ(20) రాణించారు. అనంతరం సెంట్రల్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 511 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సెంట్రల్ జోన్ బ్యాటర్లలో యశ్ రాథోడ్(194), కెప్టెన్ రజత్ పాటిదార్(101) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. సౌత్‌జోన్ బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్, అంకిత్ శర్మ తలా నాలుగు వికెట్లు సాధించారు. నార్త్‌జోన్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 362 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో అదుర్స్..
తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన సౌత్ జోన్ బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించారు. సెకెండ్ ఇన్నింగ్స్ సౌత్ జోన్ 426 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో సౌత్‌జోన్ సెంట్రల్ జోన్ ముందు కేవలం 65 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించగల్గింది. సౌత్ జోన్ బ్యాటర్లలో అంకిత్ శర్మ (168 బంతుల్లో 99; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రె సిద్ధార్థ్ (190 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు) అద్బుత ఇన్నింగ్స్‌లతో అలరించారు.
వీరిద్దరూ ఏడో వికెట్‌కు 192 పరుగులు జోడించి తమ జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశారు. రవిచంద్రన్ స్మరణ్ (118 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (85 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో కుమార్ కార్తికేయ 4, సారాంశ్ జైన్ 3 వికెట్లు పడగొట్టారు.