
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టు విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన సెంట్రల్ జోన్ ముందు రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగుల లక్ష్యం నిలిచింది. సోమవారం ఆటకు చివరి రోజు కాగా... సెంట్రల్ జోన్ విజయం లాంఛనమే.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 129/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌత్ జోన్ జట్టు చివరకు 121 ఓవర్లలో 426 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సౌత్ జోన్ బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడారు.
ముఖ్యంగా అంకిత్ శర్మ (168 బంతుల్లో 99; 13 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రె సిద్ధార్థ్ (190 బంతుల్లో 84 నాటౌట్; 7 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌లతో అలరించారు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు 192 పరుగులు జోడించి జట్టును ఒడ్డున పడేసే ప్రయత్నం చేశారు.
రవిచంద్రన్ స్మరణ్ (118 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (85 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో కుమార్ కార్తికేయ 4, సారాంశ్ జైన్ 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 149 పరుగులకు ఆలౌట్ కాగా... సెంట్రల్ జోన్ 511 పరుగులు చేసింది.
192 పరుగుల భాగస్వామ్యం...
సెంట్రల్ జోన్ స్పిన్నర్లను ఎదుర్కోలేక తొలి ఇన్నింగ్స్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన సౌత్ జోన్ బ్యాటర్లు... రెండో ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించారు. రవిచంద్రన్ స్మరణ్, రికీ భుయ్ బాధ్యతాయుతంగా ఆడటంతో... ఇక సౌత్ జోన్ జట్టు కుదురుకున్నట్లే అనిపించింది.
ఈ జంట మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించగా... ఆ తర్వాత కెపె్టన్ మొహమ్మద్ అజహరుద్దీన్ (27; 2 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ నిజార్ (12) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో 161/2తో పటిష్టంగా కనిపించిన సౌత్ జోన్... 222/6తో ఓటమి అంచున నిలిచింది. ఈ దశలో అంకిత్, సిద్ధార్థ్ చక్కటి పోరాట పటిమ కనబర్చారు.
ఒక్కో పరుగు జోడిస్తూ... ముందుకు సాగిన ఈ జంట... సెంట్రల్ జోన్ స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక స్వేచ్ఛగా షాట్‌లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. ఈ క్రమంలో అంకిత్ శర్మ 84 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... సిద్ధార్థ్ 110 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అంకిత్ అవుట్ అయ్యాడు.
దీంతో ఏడో వికెట్‌కు 192 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత మిగిలిని మూడు వికెట్లు పడేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మొత్తంగా సౌత్ జోన్ 64 పరుగుల ఆధిక్యం సాధించింది. సెంట్రల్ జోన్ జట్టు 11 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీ చేజిక్కించుకోవాలంటే చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేయాల్సి ఉంది.
స్కోరు వివరాలు
సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 149; సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 511; సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ (బి) కుల్దీప్ సేన్ 26; మోహిత్ కాలే (ఎల్బీ) (బి) సారాంశ్ జైన్ 38; స్మరణ్ (సి) యశ్ రాథోడ్ (బి) కార్తికేయ 67; రికీ భుయ్ (సి) శుభమ్ శర్మ (బి) దీపక్ చాహర్ 45; అజహరుద్దీన్ (సి) కుల్దీప్ సేన్ (బి) కార్తికేయ 27; సల్మాన్ నిజార్ (సి) రజత్ పాటీదార్ (బి) కార్తికేయ 12; ఆండ్రె సిద్ధార్థ్ (నాటౌట్) 84; అంకిత్ శర్మ (సి) రజత్ పాటీదార్ (బి) కార్తికేయ 99; గుర్‌జపనీత్ సింగ్ (సి) మాలేవర్ (బి) సారాంశ్ 3; నిధీశ్ (రనౌట్) 0; వాసుకి కౌశిక్ (స్టంప్డ్) ఉపేంద్ర యాదవ్ (బి) సారాంశ్ జైన్ 0;
ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (121 ఓవర్లలో ఆలౌట్) 426. వికెట్ల పతనం: 1–62, 2–76, 3–161, 4–200, 5–221, 6–222, 7–414, 8–419, 99–420, 10–426. బౌలింగ్: దీపక్ చాహర్ 16–2–74–1; ఆదిత్య ఠాకరే 8–2–22–0; కుమార్ కార్తికేయ 39–3–110–4; సారాంశ్ జైన్ 42–8–130–3; కుల్దీప్ సేన్ 12–1–60–1, శుభమ్ శర్మ 4–1–21–0.