
టైటిల్ కోసం సెంట్రల్ జోన్‌తో సౌత్ జోన్ పోరు
సమతూకంగా రెండు జట్లు
యువ ఆటగాళ్లకు మంచి అవకాశం
బెంగళూరు: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్‌లో గురువారం ప్రారంభం కానున్న ఈ తుది పోరులో సెంట్రల్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది. ఓ వైపు టీమిండియా ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో పాల్గొంటుండగా... మరోవైపు భారత ‘ఎ’ జట్టు ఆస్ట్రేలియా ‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో కొత్త ఆటగాళ్లు తమ సత్తా చాటుకునేందుకు దులీప్ ట్రోఫీ చక్కటి వేదిక కానుంది. గతేడాది మాదిరిగా కాకుండా తిరిగి పాత పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో నార్త్ జోన్‌పై విజయంతో సౌత్ జోన్... వెస్ట్ జోన్‌ను ఓడించి సెంట్రల్ జోన్ ఫైనల్‌కు చేరాయి. సౌత్ జోన్ జట్టు చివరిసారిగా 2023లో దులీప్ ట్రోఫీ విజేతగా నిలవగా... 2014–15 సీజన్‌లో సెంట్రల్ జోన్ ట్రోఫీ చేజిక్కించుకుంది.
అప్పుడు కూడా సౌత్‌జోన్‌పైనే నెగ్గిన సెంట్రల్ జోన్ అదే ఫలితం పునరావృతం చేయాలని యోచిస్తోంది. రజత్ పాటీదార్, దానిశ్ మాలేవర్, శుభమ్ శర్మ, యశ్ రాథోడ్, దీపక్ చాహర్, తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, షేక్ రషీద్, రికీ భుయ్, మొహమ్మద్ అజహరుద్దీన్ వంటి వాళ్లు మెరుగైన ప్రద్శన చేసి సెలెక్టర్ల దృష్టిలో పడాలని భావిస్తున్నారు.
మనవాళ్లు ఆకట్టుకునేనా...
ముందస్తు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ సౌత్ జోన్ జట్టుకు సారథ్యం వహించాల్సి ఉండగా... ఆసియా కప్‌లో ఆడుతున్న భారత జట్టుకు అతను ఎంపిక కావడంతో ఫైనల్‌కు దూరమయ్యాడు. దీంతో కేరళకు చెందిన మొహమ్మద్ అజహరుద్దీన్‌కు సారథ్య బాధ్యతలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రికీ భుయ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దేవదత్ పడిక్కల్, జగదీశన్ కూడా అందుబాటులో లేకపోవడంతో... స్మరణ్, సిద్ధార్‌్థలకు జట్టులో చోటు దక్కింది.
హైదరాబాద్ ఆటగాళ్లు తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, ఆంధ్ర ప్లేయర్లు షేక్ రషీద్, రికీ భుయ్ సౌత్ జోన్ జట్టుకు కీలకం కానున్నారు. మోహిత్ కాలె, స్మరణ్, సల్మాన్ నిజార్‌తో సౌత్ జోన్ బ్యాటింగ్ బలంగానే ఉంది. ఇక అజహరుద్దీన్ సారథిగా, వికెట్‌కీపర్‌గా, బ్యాటర్‌గా కీలకం కానున్నాడు.
గుర్‌జపనీత్ సింగ్, వాసుకి కౌశిక్, నిదీశ్, తనయ్ త్యాగరాజన్ బౌలింగ్ భారం మోయనున్నారు. పిచ్ అటు బౌలింగ్‌కు ఇటు బ్యాటింగ్‌కు సమానంగా అనుకూలించనుంది. ఆరంభంలో కాస్త జాగ్రత్త వహిస్తే భారీ స్కోర్లు చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లోనూ వర్షం ముప్పు ఉంది.
బ్యాటింగ్ బలంగా...
సౌత్ జోన్‌తో పోల్చుకుంటే... సెంట్రల్ జోన్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సెంట్రల్ జోన్ ప్లేయర్లు ముందు వరుసలో ఉన్నారు. దానిశ్ మాలేవర్ 294 పరుగులతో అగ్రస్థానంలో ఉంటే... రజత్ పాటీదార్ 268, శుభమ్ శర్మ 252 పరుగులతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పాటీదార్ 100కు పైగా స్ట్రయిక్ రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. అతడు ఇదే జోరు తుదిపోరులోనూ కనబరిస్తే సౌత్ జోన్‌కు కష్టాలు తప్పకపోవచ్చు.
ఇప్పటి వరకు ఈ టోర్నీలో పాటీదార్ వరుస ఇన్నింగ్స్‌లలో 125, 66, 77 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో తొలిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి టైటిల్ అందించిన పాటీదార్ సారథ్య అనుభవం కూడా సెంట్రల్ జోన్‌కు కలిసిరానుంది. ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్ వంటి వాళ్లు అందుబాటులో లేకపోయినా... సెంట్రల్ జోన్‌కు పెద్దగా ఇబ్బందులు లేవు. టీమిండియా ప్లేయర్ దీపక్ చాహర్‌తో పాటు వెస్ట్ జోన్‌తో సెమీఫైనల్లో 8 వికెట్లు పడగొట్టిన సారాంశ్ జైన్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు.