
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లే గొప్ప బ్యాటర్లుగా ఎదిగారని పేర్కొన్నాడు. ఇందుకు టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (Virat Kohli) చక్కటి ఉదాహరణ అని తెలిపాడు.
అయితే, ప్రస్తుత టీ20 జమానాలో తనలాంటి పొడవైన బ్యాటర్లకు ఎత్తు అదనపు ప్రయోజనంగా మారిందని ద్రవిడ్ పేర్కొన్నాడు. బలంగా సిక్సర్లు బాదేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. హల్ చాల్ ఔర్ సవాల్ పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు మాట్లాడుతూ..
నేను కాస్త పొడవుగా ఉంటాను.. కాబట్టి
‘‘క్రీజులో ఉన్నపుడు బ్యాలెన్స్ చేసుకోవడం అత్యంత ముఖ్యమైనది. గావస్కర్ (Sunil Gavaskar) అద్భుతంగా తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటాడు. క్రీజులో ఆయన నిలబడే తీరు సూపర్.
నేను కాస్త పొడవుగా ఉంటాను కదా!.. కాబట్టి ఆయనను అనుకరించడం సాధ్యంకాకపోయేది. నాకైతే బ్యాలెన్స్ చేసుకోలేక.. అసౌకర్యంగా ఉండేది. అలాగే సచిన్ టెండుల్కర్ కూడా!
గావస్కర్ మాదిరే తనూ చక్కగా బ్యాలెన్స్ చేసుకునేవాడు. ఏదేమైనా పొట్టిగా ఉన్న వాళ్లకు ఇదొక అదనపు ప్రయోజనం. వాళ్ల గురుత్వాకర్షణ కేంద్ర బలం తక్కువగా ఉంటుంది. అందుకే గొప్ప బ్యాటర్లలో చాలామంది పొట్టివాళేల ఉంటారు.
సచిన్, కోహ్లి ఇందుకు ఉదాహరణ
గావస్కర్, టెండుల్కర్, బ్రియన్ లారా, రిక్కీ పాంటింగ్.. డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఇందుకు ఉదాహరణ. కోహ్లి కూడా షార్టిష్. నేను తనని పొట్టివాడు అని అనడం కోహ్లికి నచ్చకపోవచ్చు’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
అయితే, టీ20 యుగంలో హైట్ బ్యాటర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని ద్రవిడ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. భౌతికశాస్త్రం అర్థం చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. కెవిన్ పీటర్సన్, కీరన్ పొలార్డ్, పొడవుగా ఉండటం వల్ల సిక్సర్లు బలంగా బాదగలిగారు. టీ20 ఫార్మాట్ విస్తృతమయ్యాక టాలెస్ట్ బ్యాటర్ల హవా నడుస్తోంది’’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: గిల్, స్కై, సంజూ కాదు!.. టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు: సెహ్వాగ్