Asia Cup 2025: టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్‌ ఛేంజర్లు: సెహ్వాగ్‌ | Asia Cup 2025: Suryakumar Yadav to Lead India, Sehwag Picks 3 Game-Changers | Sakshi
Sakshi News home page

గిల్‌, స్కై, సంజూ కాదు!.. టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్‌ ఛేంజర్లు: సెహ్వాగ్‌

Aug 28 2025 2:28 PM | Updated on Aug 28 2025 3:21 PM

Asia Cup 2025: Sehwag Picks 3 Game Changers For India Gill Snubbed

ఆసియా కప్‌-2025 (Asia Cup) టోర్నమెంట్‌కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈసారి యూఏఈ వేదికగా నిర్వహించే టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ టీమ్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)ను కెప్టెన్‌గా కొనసాగించిన యాజమాన్యం.. రీఎంట్రీ ఇచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది.

ఓపెనింగ్‌ జోడీ ఎవరో?
ఇక గిల్‌ గైర్హాజరీలో అభిషేక్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా ఉన్న సంజూ శాంసన్‌కు కూడా అవకాశం ఇచ్చిన బీసీసీఐ.. అతడిని కేవలం వికెట్‌ కీపర్‌గా మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. మరోవైపు.. పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా గాయం నుంచి కోలుకుని ఈ ఈవెంట్‌కు అందుబాటులోకి రావడం సానుకూలాంశం.

ఇక బుమ్రాతో పాటు టీ20 స్పెషలిస్టు అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా కూడా పేస్‌ బౌలింగ్‌ విభాగంలో చోటు దక్కించుకోగా.. స్పిన్‌ విభాగంలో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ తమ బెర్తులు ఖరారు చేసుకున్నారు. ఇక తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివం దూబే, అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ శర్మ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించారు.

సెప్టెంబరు 9-28 వరకు
కాగా సెప్టెంబరు 9-28 వరకు ఆసియా కప్‌ టోర్నీకి షెడ్యూల్‌ ఖరారైంది. అఫ్గనిస్తాన్‌- హాంగ్‌కాంగ్‌ మ్యాచ్‌తో ఈ ఖండాంతర క్రికెట్‌ ఈవెంట్‌కు తెరలేవనుండగా.. భారత్‌ సెప్టెంబరు 10న తమ తొలి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. అనంతరం సెప్టెంబరు 14న పాకిస్తాన్‌తో, సెప్టెంబరు 19న ఒమన్‌తో భారత జట్టు ఆడుతుంది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో భారత్‌ విజయం సాధిస్తుందన్న వీరూ భాయ్‌.. ముగ్గురు ఆటగాళ్లను గేమ్‌ ఛేంజర్లుగా పేర్కొన్నాడు.

టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్‌ ఛేంజర్లు
‘‘ఈ టోర్నీలో అభిషేక్‌ శర్మ గేమ్‌ ఛేంజర్‌గా మారనున్నాడు. ఇక బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అతడి సొంతం. ఇక మిస్టరీ బౌలర్‌ వరుణ్‌ చక్రవర్తి కూడా ఓ గేమ్‌ ఛేంజర్‌. వన్డే ఫార్మాట్లో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో అతడు ప్రభావం చూపాడు. అదే విధంగా.. టీ20 ఫార్మాట్లోనూ ఉత్తమంగా రాణించగలడు.

ఫాస్ట్‌ బౌలర్లు ఫిట్‌గా ఉంటే..
ఈ ముగ్గురు గనుక స్థాయికి తగ్గట్లు రాణిస్తే.. టీమిండియాను అన్ని మ్యాచ్‌లలో గెలిపించగలరు’’ అని వీరేందర్‌ సెహ్వాగ్‌ సోనీ స్పోర్ట్స్‌తో పేర్కొన్నాడు. ఈ టోర్నీలో టీమిండియా బౌలర్లు.. ముఖ్యంగా ఫాస్ట్‌ బౌలర్లు ఫిట్‌గా ఉంటే.. తిరుగు ఉండదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు. 

ఒకవేళ ఫాస్ట్‌ బౌలర్లు పూర్తి ఫిట్‌గా ఉంటే.. ఆసియా కప్‌తో పాటు వరల్డ్‌కప్‌లోనూ టీమిండియా గెలిచే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. కాగా టీమిండియా చివరగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 రూపంలో మెగా టైటిల్‌ సాధించింది.

చదవండి: అతడికి బౌలింగ్ చేయడం కష్టం: ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement