
మార్క్ వుడ్.. వరల్డ్ క్రికెట్‌లో అత్యంత వేగంతో బంతులు సంధించే పేస్ బౌలర్లలో ఒకడు. గంటకు 150 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడిది. కానీ ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్‌ను ఓ బ్యాటర్ భయపెట్టాడంట. సదరు బ్యాటర్‌కు బౌలింగ్ చేసేందుకు వుడ్ తీవ్రంగా శ్రమించాడంట.
ఆ బ్యాటర్ ఎవరో కాదు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ ఏడాది మార్చి నుంచి గాయం కారణంగా ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉంటున్న మార్క్ వుడ్.. తిరిగి తన ఫిట్‌నెస్‌ను పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. యాషెస్ సిరీస్ సమయానికి గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
అయితే మార్క్ వుడ్ తాజాగా ఓవర్‌లాప్ క్రికెట్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఇప్పటివరకు తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరన్న ప్రశ్న వుడ్‌కు ఎదురైంది. అందుకు అతడు బదులుగా రోహిత్ శర్మ పేరును చెప్పాడు. 35 ఏళ్ల మార్క్ వుడ్ అన్ని ఫార్మాట్లలోనూ హిట్‌మ్యాన్‌ను ఎదుర్కొన్నాడు.
"నా కెరీర్‌లో ఇప్పటివరకు నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ రోహిత్ శర్మ. ఫార్మాట్ ఏదైనా కానీ అతడికి బౌలింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డాను. షార్ట్ బాల్ వేసినప్పుడు అతడిని ఔట్ చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది. కానీ ఆ రోజు అతడు మంచి రిథమ్‌లో ఉంటే అపడం ఎవరి తరం కాదు. భారీ షాట్లతో విరుచుకుపడతాడు" అని వుడ్ పేర్కొన్నాడు.
అదేవిధంగా విరాట్ కోహ్లి గురుంచి కూడా వుడ్ మాట్లాడాడు. "కోహ్లికి అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ప్రతీ బౌలర్‌కు అతడి నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ ఆఫ్‌సైడ్ ఫోర్త్, ఫిఫ్త్ స్టంప్‌లైన్‌లో వచ్చే బంతులు ఆడే విషయంలో మాత్రం అతడికి బలహీనత ఉంది.
వాటికి తప్ప మరో బంతికి అతడిని అవుట్ చేయడం చాలా కష్టం" అని మార్క్ వుడ్ చెప్పుకొచ్చాడు. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ద్వయం స్టీవ్ స్మిత్, మిచెల్ మార్ష్‌లకు బౌలింగ్ చేయడం కష్టమని ఈ ఇంగ్లీష్ స్పీడ్ స్టార్ తెలిపాడు.
చదవండి: పాక్, భారత్, శ్రీలంక కాదు.. ఆసియాకప్ గెలిచేది వాళ్లే: పాక్ మాజీ క్రికెటర్