
గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో అదరగొడుతున్న దబంగ్ ఢిల్లీ ‘ప్లే ఆఫ్స్’ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. తద్వారా తాజా సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. సీజన్ ఆరంభం నుంచి తిరుగులేని ప్రదర్శన కనబరుస్తున్న దబంగ్ ఢిల్లీ శుక్రవారం జరిగిన పోరులో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. రెయిడర్లు రాణించడంతో దబంగ్ ఢిల్లీ 39–33 పాయింట్ల తేడాతో గుజరాత్‌పై గెలుపొందింది. దబంగ్ ఢిల్లీ తరఫున అక్షిత్ ధుల్ 12 పాయింట్లతో సత్తా చాటాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున హిమాన్షు 11 పాయింట్లు సాధించాడు.
అశు మలిక్ గైర్హాజరీలో అక్షిత్ సూపర్ రెయిడ్‌లతో చెలరేగడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 23 రెయిడ్ పాయింట్లు సాధిస్తే... జెయింట్స్ 16కే పరిమితమైంది. ట్యాక్లింగ్‌లో గుజరాత్ 15 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... ఢిల్లీ 10 పాయింట్లు సాధించింది. తాజా సీజన్‌లో 14 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 12 విజయాలు, 2 పరాజయాలతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో నిలిచింది.
శనివారం నుంచి పీకేఎల్ పోటీలు ఢిల్లీ వేదికగా జరగనుండగా... సొంతగడ్డపై అడుగుపెట్టకముందే ఢిల్లీ జట్టు ‘ప్లే ఆఫ్స్’ బెర్తు ఖరారు చేసుకుంది. గుజరాత్ జెయింట్స్ 13 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 9 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టిక పదో స్థానంలో కొనసాగుతోంది. మరోమ్యాచ్‌లో యు ముంబా 48–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. యు ముంబా తరఫున సందీప్ కుమార్ 13, అజిత్ చవాన్ 12 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
బెంగాల్ వారియర్స్ తరఫున దేవాంక్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో యు ముంబా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా... బెంగాల్ వారియర్స్ 9వ స్థానంలో ఉంది. లీగ్‌లో భాగంగా శనివారం బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్, తమిళ్ తలైవాస్‌తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి.