Nitu Ghanghas: జీతం లేని సెలవు పెట్టి తండ్రి త్యాగం! కూతురు ‘బంగారం’తో మెరిసి..

CWG 2022: Golden Girl Nitu Ghanghas Inspirationational Journey In Telugu - Sakshi

తండ్రి త్యాగం... కూతురు బంగారం 

CWG 2022- Boxer Nitu Ghanghas: బాక్సింగ్‌లో మన అమ్మాయిల పంచ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో గట్టిగా పడింది. తెలంగాణ నిఖత్‌ జరీన్‌తో పాటు హర్యాణ నీతు ఘణఘస్‌ కూడా స్వర్ణం సాధించింది. నిఖత్‌ వెనుక ఆమె తండ్రి ఎలా మద్దతుగా నిలిచాడో నీతు ఘంఘస్‌ వెనుక ఆమె తండ్రి జై భగవాన్‌ నిలిచాడు. హర్యాణ విధాన సభలో బిల్‌ మెసెంజర్‌గా పని చేసే జై భగవాన్‌ ఉద్యోగానికి జీతం లేని సెలవు పెట్టి నీతు బాక్సింగ్‌కు వెన్నుదన్నుగా నిలిచాడు. అతని త్యాగం ఫలించింది. నీతు బంగారు పతకం సాధించింది.

ఆదివారం కామన్వెల్త్‌ క్రీడలలో బంగారు పతకం సాధించిన నీతు ఘణఘస్‌ అక్కడి నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో అభిమానులు ‘భారత మాతాకీ జై’ అని ఉత్సాహంగా నినాదాలు ఇస్తుంటే తన మెడలోని బంగారు పతకాన్ని చూపుతూ ‘ఈ పతకం ఈ దేశ ప్రజలందరితో పాటు మా నాన్నకు అంకితం’ అని చెప్పింది. కామన్‌వెల్త్‌ క్రీడలలో 45– 48 కేజీల విభాగంలో నీతు ఘణఘస్‌ ఇంగ్లండ్‌ బాక్సర్‌ డెమీ జేడ్‌ను ఘోరంగా ఓడించింది.

ఎంత గట్టిగా అంటే రెఫరీలందరూ ఆమెకు ఏకగ్రీవంగా 5–0తో గెలుపునిచ్చారు. ‘మా కోచ్‌ భాస్కర్‌ చంద్ర భట్‌ నాతో నీ ప్రత్యర్థి ఎత్తు తక్కువ ఉంది. ఎక్కువగా దాడి చేసే వీలు ఉంది. కాచుకోవడానికి పక్కకు జరుగుతూ దాడి చెయ్‌ అన్నారు. అదే పాటించాను’ అంది నీతు. ఇలాంటి ఎన్నో సవాళ్లను సమర్థంగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొంది కాబట్టే ఇవాళ ఆమె విజేత అయ్యింది. తండ్రికీ, దేశానికీ గర్వకారణంగా నిలిచింది.

అతని గెలుపుతో స్ఫూర్తి
2008లో బీజింగ్‌ ఒలిపింగ్స్‌లో బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ స్వర్ణం సాధించడంతో నీతు కల మొదలైంది. అప్పటికి ఆ అమ్మాయికి 8 ఏళ్లు. ఆమె ఊరు ధనానాకు విజేందర్‌ సింగ్‌ ఊరు సమీపంలోనే ఉంటుంది. ఆ తర్వాత మూడు నాలుగేళ్ల వరకూ విజేందర్‌ విజయాలు సాధిస్తూనే ఉన్నాడు.

12 ఏళ్ల వయసులో నీతు తాను కూడా బాక్సర్‌ కావాలని నిశ్చయించుకుంది. ముగ్గురు తోబుట్టువులలో ఒకరైన నీతు ఇంట్లోగాని స్కూల్‌లోగాని ఫైటింగుల్లో ముందు ఉంటుంది. ఆ దూకుడు గమనించిన తండ్రి జై భగవాన్‌ ఆమెను బాక్సర్‌ను చేయడానికి నిశ్చయించుకుని చండీగఢ్‌లోని కుటుంబాన్ని ధనానాకు మార్చాడు.

తను ఉద్యోగం చేస్తూ కూతురిని అక్కడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘భివాని బాక్సింగ్‌ క్లబ్‌’కు శిక్షణ కోసం వెళ్లి వచ్చే ఏర్పాటు చేశాడు. భివానిలోనే విజేందర్‌ సింగ్‌ బాక్సింగ్‌ శిక్షణ తీసుకున్నాడు. రెండేళ్లు గడిచిపోయాయి. కాని నీతు బాక్సింగ్‌లో చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేదు. ‘నేను బాక్సింగ్‌ మానేస్తాను నాన్నా’ అని తండ్రికి చెప్పింది. కాని కూతురు అలా నిరాశలో కూరుకుపోవడం తండ్రికి నచ్చలేదు.

ఉద్యోగానికి సెలవు పెట్టి
చండీఘడ్‌లో విధాన సభలో బిల్‌ మెసెంజర్‌గా పని చేసేవాడు. చిన్న ఉద్యోగం. మూడేళ్లు లీవ్‌ అడిగాడు కూతురి కోసం. అన్నేళ్లు ఎవరు ఇస్తారు. పైగా కూతురి బాక్సింగ్‌ కోసం అంటే నవ్వుతారు. కాని జై భగవాన్‌ లాస్‌ ఆఫ్‌ పే మీద వెళ్లిపోయాడు. సొంత ఊరు ధనానాకు చేరుకుని ఉదయం సాయంత్రం కూతురిని ట్రైనింగ్‌కు తీసుకెళ్లసాగాడు.

జరుగుబాటుకు డబ్బులు లేవు. తండ్రి నుంచి వచ్చిన పొలంలో కొంత అమ్మేశాడు. ఎప్పుడో కొనుక్కున్న కారు అమ్మేశాడు. ఒక్కోసారి ట్రైనింగ్‌ కోసం ధనానా నుంచి భివానికి నీతు వెళ్లకపోయేది. ఇంట్లోనే సాధన చేయడానికి ఊక బస్తాను వేళ్లాడగట్టి ఉత్సాహపరిచేవాడు. ‘నువ్వు గొప్ప బాక్సర్‌వి కావాలి’ అనేవాడు. ‘నాన్నా... నేను మంచి బాక్సర్‌ని కాకపోతే నువ్వు ఉద్యోగంలో చేరిపో’ అని నీతు అనేది. ‘దాని గురించి ఆలోచించకు’ అని లక్ష్యంవైపు గురి నిలపమనేవాడు.

విజయం వరించింది
జై భగవాన్‌ అతని భార్య ముకేశ్‌ కుమారి కలిసి నీతు మీద పెట్టుకున్న ఆశలు ఫలించాయి. 2017, 2018 రెండు సంవత్సరాలు వరుసగా యూత్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో నీతు ఛాంపియన్‌గా నిలిచింది. 21 ఏళ్ల వయసులో మొదటిసారిగా కామన్వెల్త్‌ క్రీడల్లో దిగి గోల్డ్‌మెడల్‌ సాధించడంతో ఆమె ఘనత ఉన్నత స్థితికి చేరింది.

గొప్ప విషయమేమంటే ఏ విధాన సభలో తండ్రి పని చేస్తాడో అదే విధాన సభ చైర్మన్‌ జ్ఞాన్‌చంద్‌ నీతు విజయం గురించి విని సంబరాలు జరపడం. నీతు తండ్రి జై భగవాన్‌కు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపాడు. ‘మనమ్మాయి గొప్ప విజయం సాధించింది’ అన్నాడాయన జై భగవాన్‌తో నిజమే. ఇప్పుడు నీతు ‘మన అమ్మాయి’. మన భారతదేశ గర్వకారణం.

చదవండి: CWG 2022: నిఖత్‌ జరీన్‌కు అరుదైన గౌరవం
Sourav Ganguly: మహిళా క్రికెట్‌ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్‌.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top