CWC 2023 ENG VS NZ: కాన్వే, రచిన్‌ మెరుపు శతకాలు.. రికార్డు భాగస్వామ్యం నమోదు | Sakshi
Sakshi News home page

CWC 2023 ENG VS NZ: కాన్వే, రచిన్‌ మెరుపు శతకాలు.. రికార్డు భాగస్వామ్యం నమోదు

Published Thu, Oct 5 2023 8:36 PM

CWC 2023 ENG VS NZ: Conway, Rachin pair Contributes Highest partnership For Any Wicket For NZ In World Cup - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023కి అదిరిపోయే ఆరంభం లభించింది. ఈ ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లోనే రెండు శతకాలు నమోదయ్యాయి. న్యూజిలాండ్‌ బ్యాటర్లు డెవాన్‌ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్‌; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచిన్‌ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయమైన శతకాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో వారు ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

ఈ మ్యాచ్‌లో కాన్వే, రచిన్‌ జోడి రెండో వికెట్‌కు అజేయమైన 273 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ప్రపంచకప్‌ టోర్నీల్లో న్యూజిలాండ్‌ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 1996 వరల్డ్‌కప్‌లో లీ జెర్మాన్‌-క్రిస్‌ హారిస్‌ జోడి నమోదు చేసిన 168 పరుగుల భాగస్వామ్యామే ఈ మ్యాచ్‌కు ముందు వరకు ప్రపంచకప్‌ల్లో న్యూజిలాండ్‌ బెస్ట్‌ పార్ట్‌నర్‌షిప్‌గా ఉండింది. తాజాగా కాన్వే-రచిన్‌ జోడీ ఈ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. 

ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్న కాన్వే, రచిన్‌ సెంచరీకి చేరుకునేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. కాన్వే 83 బంతుల్లో శతక్కొడితే.. రచిన్‌ 81 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. వన్డేల్లో కాన్వేకు ఇది ఐదో సెంచరీ కాగా.. రచిన్‌కు తన కెరీర్‌ మొత్తంలోనే ఇది తొలి సెంచరీ. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేయగా.. కాన్వే, రచిన్‌ శతక్కొట్టడంతో న్యూజిలాండ్‌ 36.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది.

Advertisement
Advertisement