చెలరేగిన గైక్వాడ్‌.. చెన్నై విక్టరీ

CSK Won The Match By 6 Wickets Against KKR - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5వ విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఆఖరిబంతికి చేధించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడం, ఆఖర్లో జడేజా సిక్సర్లతో హోరెత్తించడంతో కేకేఆర్‌పై విజయం సాధించింది. ఓపెనర్‌ వాట్సన్‌ 14 పరుగులకే వెనుదిరిగినా రాయుడు అండతో రుతురాజ్‌ రన్‌రేట్‌ పడిపోకుండా బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఈ క్రమంలోనే 37 బంతుల్లో రుతురాజ్‌ అర్థసెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరి భాగస్వామ్యం  బలపడుతున్న వేళ 38 పరుగులు చేసిన రాయుడుని కమిన్స్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ ధోని కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సామ్‌ కరాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించిన గైక్వాడ్‌ అనూహ్యంగా కమిన్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. చివర్లో కాస్త హైడ్రామా నడిచిన జడేజా 10 బంతుల్లో 31 పరుగులు(2ఫోర్లు,3సిక్స్‌లతో) రెచ్చిపోవడంతో ఆఖరిబంతికి చెన్నై విజయాన్ని నమోదు చేసింది. కాగా కేకేఆర్ ఈ ఓటమితో ప్లేఆఫ్‌ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది.

అంతకముందు టాస్‌ గెలిచిన చెన్నై కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వనించింది. ఓపెనర్లు శుభమన్‌ గిల్‌, నితీష్‌ రాణాలు ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. పవర్‌ ప్లే ముగిసే సమయానికి కేకేఆర్‌ 6ఓవర్లలో 48 పరుగులు చేసింది. 26 పరుగులు చేసిన గిల్‌ జట్టు స్కోరు 53 పరుగుల వద్ద ఉన్నప్పుడు కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సునీల్‌ నరైన్‌ వచ్చీ రాగానే భారీ సిక్స్‌ కొట్టినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.  కాసేపటికే రింకూ సింగ్‌ కూడా వెనుదిరగడంతో కేకేఆర్‌ 99 పరుగులకే 3 వికెట్లు కోల్పయింది. ఈ దశలో మరో ఓపెనర్‌ నితీష్‌ రాణా 44 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కర్ణ్‌ శర్మ వేసిన 16వ ఓవర్లో నితీష్‌ రాణా హ్యాట్రిక్‌ సిక్సర్లతో మొత్తం 19 పరుగులు పిండుకోవడంతో కేకేఆర్‌ స్కోరు ఒక్కసారిగా మారిపోయింది. దీపక్‌ చాహర్‌ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లతో విరుచకుపడిన రాణా 87 పరుగుల వద్ద ఎన్గిడి బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక చివర్లో దినేష్‌ కార్తీక్‌ 10 బంతుల్లోనే 21 పరుగులు చేయడంతో కేకేఆర్‌ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సీఎస్‌కే బౌలర్లలో ఎన్గిడి 2, సాంట్నర్‌, జడేజా, కర్ణ్‌ శర్మ తలా ఒక వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top