సిక్సర్ల సునామీ.. విధ్వంసం​ సృష్టించిన విండీస్‌ వీరులు

CPL 2023: Pooran Slams Blasting Fifty Vs St Kitts, Rutherford Fifty Goes In Vain - Sakshi

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్‌ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్‌ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి.

హెట్‌మైర్‌, కీమో పాల్‌ ఊచకోత
జమైకా తల్లావాస్‌-గయానా అమెజాన్‌ వారియర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గయానా.. షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్‌ (29 బంతుల్లో 57; ఫోర్‌, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్‌గా మలిచాడు.

వీరికి షాయ్‌ హోప్‌ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్‌ (9 బంతుల్లో 19 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) జతకావడంతో గయానా టీమ్‌ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్‌ ఆమిర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్‌ గ్రీన్‌ 2, సల్మాన్‌ ఇర్షాద్‌, రీఫర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

సరిపోని ఇమాద్‌ వసీం, ఫేబియన్‌ అలెన్‌ మెరుపులు
211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్‌ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్‌ అలెన్‌ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్‌ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్‌ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్‌ (2/35), సింక్లెయిర్‌ (2/17) రాణించారు. 

రూథర్‌పోర్డ్‌ ప్రయాస వృధా.. 
సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ కిట్స్‌.. షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (38 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్‌ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్‌ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్‌)‌ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు.

విధ్వంసం సృష్టించిన పూరన్‌, పోలార్డ్‌, రసెల్‌
179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్‌ పూరన్‌ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్‌ పోలార్డ్‌ (16 బంతుల్లో 37 నాటౌట్‌; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌ (8 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్‌రైడర్స్‌ 17.1 ఓవర్లలో కేవలం​ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్‌ కిట్స్‌ బౌలర్లలో బోష్‌ 3, ముజరబానీ ఓ వికెట్‌ పడగొట్టారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top