నేటి నుంచి ధనాధన్‌ క్రికెట్‌ లీగ్‌ ప్రారంభం.. భారత్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం | Sakshi
Sakshi News home page

CPL 2021: నేటి నుంచి ధనాధన్‌ క్రికెట్‌ లీగ్‌ ప్రారంభం.. భారత్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం

Published Thu, Aug 26 2021 4:40 PM

CPL 2021: League Starts From Today, Live Telecast In India - Sakshi

సెయింట్ కిట్స్: ఐపీఎల్‌ తరువాత ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ కలిగిన కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌-2021 నేటి నుంచి ప్రారంభంకానుంది. ఐపీఎల్‌ను తలపించేలా భారీ షాట్లతో అలరించేందుకు ప్రపం‍చవ్యాప్తంగా ఉన్న విధ్వంసకర యోధులు సిద్ధంగా ఉన్నారు. విండీస్‌ విధ్వంసకర వీరులు క్రిస్‌ గేల్‌, కీరన్‌ పోలార్డ్‌, ఆండ్రీ రసెల్‌, డ్వేన్‌ బ్రావో సహా వివిధ దేశాలకు చెందిన చాలా మంది స్టార్‌ క్రికెటర్లు ఈ లీగ్‌లో ఆడనున్నారు. దీంతో ఐపీఎల్‌కు ముందే ధనాధన్‌ బ్యాటింగ్‌ విన్యాసాలు  క్రికెట్‌ అభిమానులకు కనువిందు చేయనున్నాయి. లీగ్‌లో భాగంగా తొలి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. సెయింట్ కిట్స్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్(నికోలస్‌ పూరన్‌ జట్టు), ట్రింబాగో నైట్ రైడర్స్(పోలార్డ్‌ జట్టు) తలపడనున్నాయి.

ఇదిలా ఉంటే, సీపీఎల్‌-2021లో భాగంగా జరిగే మ్యాచ్‌లన్నింటినీ స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. భారత సహా మరో 100 దేశాల్లో ఈ మ్యాచ్‌లు లైవ్ టెలికాస్ట్ కానున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్‌బుక్, యుట్యూబ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేయనున్నట్లు కరీబియన్ ప్రీమియర్ లీగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పీట్ రస్సెల్స్ తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు కొన్ని అంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. స్టేడియాల్లోకి 50 శాతం మంది అభిమానులకు మాత్రమే అనుమితిస్తున్నట్లు వెల్లడించింది.  సెప్టెంబర్ 15న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో ఈ లీగ్ ముగియనుండగా, సరిగ్గా నాలుగు రోజుల తర్వాత(సెప్టెంబర్‌19) యూఏఈ వేదికగా ఐపీఎల్-2021 మలి దశ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.
చదవండి: ఇంగ్లండ్‌ అభిమానుల ఓవరాక్షన్‌.. సిరాజ్‌పై బంతితో దాడి

Advertisement
Advertisement