
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఆటగాడు కొలిన్ మున్రో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే విధ్వంసకర శతకం 120(57) సహా వరుసగా 44(18), 43(30), 9(10), 67(44) స్కోర్లు చేసిన అతడు.. తాజాగా మరో మెరుపు అర్ద శతకం బాదాడు.
గయానా అమెజాన్ వారియర్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 31) జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. మున్రోతో పాటు మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (43 బంతుల్లో 74; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) కూడా చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
పాయింట్ల పట్టకలో ఇప్పటికే అగ్రస్థానంలో (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) ఉన్న ఆ జట్టు.. తాజా విజయంతో పాయింట్లను మరింత మెరుగుపర్చుకుని టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంది.
న్యూజిలాండ్‌కు చెందిన 38 ఏళ్ల కొలిన్ మున్రో ఈ సీజన్‌లో నైట్‌రైడర్స్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో నైడ్‌రైడర్స్ జట్టు కూడా అరివీర భయంకరంగా ఉంది. జట్టు నిండా విధ్వంసకర వీరులే ఉన్నారు.
ఓపెనర్లుగా అలెక్స్ హేల్స్, కొలిన్ మున్రో.. వన్‌డౌన్‌లో కెప్టెన్ నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో కీరన్ పోలార్డ్, ఐదో ప్లేస్‌లో ఆండ్రీ రసెల్, లోయర్ మిడిలార్డర్‌లో సునీల్ నరైన్.. ఇలా జట్టు మొత్తం హేమాహేమీలతో నిండుకుని ఉంది.
ఈ జట్టు బౌలింగ్ విభాగంలోనూ పటిష్టంగా ఉంది. మొహమ్మద్ ఆమిర్, సునీల్ నరైన్, రసెల్, అకీల్ హొసేన్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లతో కళకళలాడుతుంది. ఇలాంటి జట్టుతో కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్లనే కాదు, ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించవచ్చు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమెజాన్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో హోప్ (39) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. ఆఖర్లో ప్రిటోరియస్ (21), సామ్పన్ (25) బ్యాట్ ఝులిపించడంతో వారియర్స్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో అకీల్ హొసేన్ 3 వికెట్లతో చెలరేగగా.. టెర్రన్స్ హిండ్స్ 2, ఆమిర్, రసెల్, నరైన్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్.. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (74), కొలిన్ మున్రో (52) చెలరేగడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరుకుంది. హేల్స్, మున్రో తొలి వికెట్‌కు 116 పరుగులు జోడించాక.. నైట్‌రైడర్స్‌ను వారియర్స్ కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ (4-0-27-4) కాస్త ఇబ్బంది పెట్టాడు. స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు తీశాడు. అయితే అప్పటికే నైట్‌రైడర్స్ గెలుపు ఖరారైపోయింది. పోలార్డ్ (12 నాటౌట్), రసెల్ (27 నాటౌట్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు.