
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2025లో న్యూజిలాండ్ వికెట్‌కీపర్ బ్యాటర్, సెయింట్ లూసియా కింగ్స్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ వీరంగం సృష్టించాడు. నిన్న (ఆగస్ట్ 31) ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సుడిగాలి శతకం బాదాడు. సీఫర్ట్ విధ్వంసకర శతకం ధాటికి లూసియా కింగ్స్ 205 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన సీఫర్ట్ మొత్తంగా 53 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సీఫర్ట్ చేసిన సెంచరీ కరీబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డైంది. 2018 ఎడిషన్‌లో ఆండ్రీ రసెల్ జమైకా తలైవాస్‌కు ఆడుతూ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై 40 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఈ మ్యాచ్‌లో సీఫర్ట్ చేసిన స్కోర్ (125 నాటౌట్) కరీబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే రెండో అత్యధికం. ఈ రికార్డు బ్రాండన్ కింగ్ పేరిట ఉంది. 2019 ఎడిషన్‌లో కింగ్ గయానా అమెజాన్ వారియర్స్‌కు ఆడుతూ బార్బడోస్ ట్రైడెంట్స్‌పై అజేయమైన 132 పరుగులు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌తో సీఫర్ట్ ఖాతాలో మరో రెండు రికార్డులు కూడా చేరాయి. ఛేదనలో (కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో) అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా సీఫర్ట్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ రసెల్ (121 నాటౌట్) పేరిట ఉండేది.
ఈ సెంచరీతో సీఫర్ట్ సెయింట్ లూసియా కింగ్స్ తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉండేది. ఫాఫ్ 2021 సీజన్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌పై అజేయమైన 120 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్.. ఆమిర్ జాంగూ (56), షకీబ్ అల్ హసన్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఫాల్కన్స్ ఇన్నింగ్స్‌లో ఫాబియన్ అలెన్ (17 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లూసియా కింగ్స్ బౌలర్లలో తబ్రేజ్ షంషి 3 వికెట్లతో రాణించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో టిమ్ సీఫర్ట్ ఆది నుంచే చెలరేగడంతో లూసియా కింగ్స్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. లూసియా కింగ్స్‌ను సీఫర్ట్ ఒక్కడే విజయతీరాలు దాటించాడు. మిగతా బ్యాటర్లు కేవలం స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు మాత్రమే పనికొచ్చారు. సీఫర్ట్ తర్వాత అత్యధిక స్కోర్ 23 పరుగులుగా ఉంది. ఈ స్కోర్‌ను టిమ్ డేవిడ్ (16 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లు) చేశాడు. జాన్సన్ ఛార్లెస్ 17, అకీమ్ అగస్ట్ 19, రోస్టన్ ఛేజ్ 11 పరుగులకు పరిమితమయ్యారు.