
జింబాబ్వే ట్రై సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 22) జరిగిన ఐదో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ సౌతాఫ్రికాను 134 పరుగులకే (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది.
జేకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, మిచెల్ సాంట్నర్ తలో 2, విలియమ్ ఓరూర్కీ ఓ వికెట్ తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ (41) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. ఆఖర్లో జార్జ్ లిండే (23 నాటౌట్) గౌరవప్రదమైన స్కోర్ కోసం పోరాడాడు. కెప్టెన్ డస్సెన్ 14, రూబిన్ హెర్మన్ 10, డెవాల్డ్ బ్రెవిస్ 13, డ్రి ప్రిటోరియస్ 1, సైమ్‌లేన్ 11, కొయెట్జీ 0, ముత్తుసామి 8, ఎన్ పీటర్ 7 (నాటౌట్) పరుగులు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించడంతో 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (19), రచిన్ రవీంద్ర (3), మార్క్ చాప్‌మన్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. డారిల్ మిచెల్ (20 నాటౌట్) సహకారంతో సీఫర్ట్ న్యూజిలాండ్‌ను గెలిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సైమ్‌లేన్ ఓ వికెట్ పడగొట్టాడు.
కాగా, ఈ ముక్కోణపు సిరీస్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇదివరకే ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆతిథ్య జట్టు జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 24న జరుగబోయే నామమాత్రపు మ్యాచ్‌లో జింబాబ్వే న్యూజిలాండ్‌తో తలపడనుంది. జులై 26న హరారేలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటాయి.