
PC: TKR X
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2025 (CPL) సీజన్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ స్టార్ కొలిన్ మున్రో (Colin Munro)విధ్వంసకర శతకంతో మెరిశాడు. కేవలం 57 బంతుల్లోనే 120 పరుగులతో దుమ్ములేపాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా మున్రో ఈ మేరకు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.
కాగా ఆగష్టు 14న సీపీఎల్ తాజా ఎడిషన్ మొదలైంది. ఈ క్రమంలో ఆదివారం తమ తొలి మ్యాచ్‌లో భాగంగా నైట్ రైడర్స్ సెయింట్స్ కిట్స్ జట్టుతో తలపడింది. సొంత మైదానం వార్నర్ పార్క్ వేదికగా టాస్ గెలిచిన సెయింట్ కిట్స్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్ (Alex Hales) అదిరిపోయే ఆరంభం అందించారు.
Play of the Day = Munro Masterclass 💯🔥
A stunning CPL 2025 century to light up Warner Park! #CPL25 #BiggestPartyInSport #CricketPlayedLouder #SKNPvTKR #RepublicBank pic.twitter.com/9S49gelm9t— CPL T20 (@CPL) August 17, 2025
యాభై బంతుల్లోనే
మున్రో యాభై బంతుల్లోనే శతక మార్కు అందుకున్నాడు. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొని.. 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో ఏకంగా 120 పరుగులు రాబట్టాడు. మరోవైపు.. హేల్స్ 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 47 రన్స్ చేశాడు. అయితే, కెప్టెన్ నికోలస్ పూరన్ (13)తో పాటు కీరన్ పొలార్డ్ (19) విఫలం కాగా.. కేసీ కార్టీ ఆఖర్లో మెరుపులు (8 బంతుల్లో 16 నాటౌట్) మెరిపించాడు.
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఐదు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. సెయింట్ కిట్స్ బౌలర్లలో కెప్టెన్ జేసన్ హోల్డర్, వకార్ సలామ్‌ఖీల్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. డొనిమినిక్ డ్రేక్స్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
హోల్డర్ ధనాధన్ దంచికొట్టినా..
ఇక లక్ష్య ఛేదనకు దిగిన సెయింట్స్ కిట్స్‌కు మెరుగైన ఆరంభం దక్కింది. ఓపెనర్లు కైలీ మేయర్స్ (22 బంతుల్లో 32), ఆండ్రీ ఫ్లెచర్ (26 బంతుల్లో 41) రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్ రీసీ రోసోవ్ (24 బంతుల్లో 38) కూడా ఫర్వాలేదనిపించాడు.
ఇక కెప్టెన్ జేసన్ హోల్డర్ (22 బంతుల్లో 44) ధనాధన్ దంచికొట్టగా.. మిగతా వారిలో డొమినిక్ డ్రేక్స్ (12 బంతుల్లో 20 నాటౌట్), నసీం షా (5 బంతుల్లో 17 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశారు. అయితే, నైట్ రైడర్స్ బౌలర్ల విజృంభణ కారణంగా సెయింట్స్ కిట్స్ గెలుపునకు 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసిన సెయింట్స్ కిట్స్.. నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. నైట్ రైడర్స్ బౌలర్లలో ఉస్మాన్ తారిక్ నాలుగు వికెట్లతో చెలరేగి కిట్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. అకీల్ హొసేన్, మొహమ్మద్ ఆమిర్, సునిల్ నరైన్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.
క్రిస్ గేల్ తర్వాత..
కాగా సీపీఎల్ చరిత్రలో అతిపెద్ద వయసులో సెంచరీ బాదిన క్రికెటర్‌గా విండీస్ వీరుడు క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు. యూనివర్సల్ బాస్ 39 ఏళ్ల 354 రోజుల వయసులో సీపీఎల్‌లో శతకం నమోదు చేశాడు.
తాజాగా కొలిన్ మున్రో 38 ఏళ్ల 159 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. తద్వారా క్రిస్ గేల్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. అంతేకాదు.. సీపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన విదేశీ ఆటగాడిగా ఫాఫ్ డుప్లెసిస్ (120 నాటౌట్) రికార్డు సమం చేశాడు. ఈ లిస్టులో ఓవరాల్‌గా బ్రాండన్ కింగ్ (విండీస్- 132*) టాప్‌లో ఉన్నాడు.
ఆరు జట్ల మధ్య పోటీ
ఇదిలా ఉంటే.. సీపీఎల్‌లో ఆంటిగ్వా అండ్ బర్బూడా ఫాల్కన్స్, గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, సెయింట్ లూసియా కింగ్స్, బార్బడోస్ రాయల్స్ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.
చదవండి: ‘కోహ్లి కాదు!.. వాళ్లిద్దరికి బౌలింగ్ చేయడం కష్టం.. సచిన్ స్మార్ట్’