నేపాల్‌ సంచలన విజయం.. వెస్టిండీస్‌కు ఘోర పరాభవం | UAE: Nepal Beat West Indies in 1st T20I Sensational Win Creates History | Sakshi
Sakshi News home page

నేపాల్‌ సంచలన విజయం.. వెస్టిండీస్‌కు ఘోర పరాభవం

Sep 28 2025 10:50 AM | Updated on Sep 28 2025 12:10 PM

UAE: Nepal Beat West Indies in 1st T20I Sensational Win Creates History

నేపాల్‌ క్రికెట్‌ జట్టు సంచలన విజయం సాధించింది. తొలి టీ20లో వెస్టిండీస్‌ (WI vs NEP 1st T20)ను 19 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా టెస్టు హోదా ఉన్న జట్టుపై తొలిసారి గెలుపు రుచి చూసింది. కాగా వెస్టిండీస్‌- నేపాల్‌ జట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతున్నాయి.

ఇందులో భాగంగా షార్జాలో శనివారం రాత్రి తొలి టీ20 జరిగింది. టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. నేపాల్‌ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఓపెనర్లు కుశాల్‌ భుర్తేల్‌ (6), ఆసిఫ్‌ షేక్‌ (3) పూర్తిగా విఫలం కాగా నేపాల్‌ కష్టాల్లో పడింది.

148 పరుగులు
ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ పౌడేల్‌ (Rohit Paudel) నిలకడగా ఆడుతూ 21 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. మరోవైపు.. గుల్షాన్‌ ఝా (16 బంతుల్లో 22), దీపేంద్ర సింగ్‌ (17) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నేపాల్‌ 148 పరుగులు చేయగలిగింది.

ఊహించని షాక్‌
వెస్టిండీస్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నవీన్‌ బిడైసీ మూడు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అకీల్‌ హొసేన్‌కు ఒక వికెట్‌ దక్కింది. అయితే, నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు నేపాల్‌ ఊహించని షాకిచ్చింది.

నేపాళ్‌ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన విండీస్‌.. 129 పరుగుల వద్ద నిలిచిపోయింది. టాపార్డర్‌లో ఓపెనర్లు కైల్‌ మేయర్స్‌ (5), ఆమిర్‌ జంగూ (19).. అకీమ్‌ ఆగస్టీ (15) విఫలమయ్యారు. మిగతావారిలో జువెల్‌ ఆండ్రూ (5), కేసీ కార్టీ (16) తేలిపోగా.. నవీన్‌ బిడైసీ 22 పరుగులతో విండీస్‌ టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మిగిలిన వారిలో ఫాబియాన్‌ అలెన్‌ 19, అకీల్‌ హొసేన్‌ 18 పరుగులు చేయగలిగారు. నేపాల్‌ బౌలర్లలో కుశాల్‌ భుర్తేల్‌ రెండు వికెట్లు తీయగా.. దీపేంద్ర సింగ్‌, కిరణ్‌ కేసీ, నందన్‌ యాదశ్‌, లలిత్‌ రాజ్‌బన్షీ, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ రోహిత్‌ పౌడేల్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. వీరంతా సమిష్టిగా రాణించి నేపాల్‌కు చారిత్రాత్మక విజయం అందించారు.

180 మ్యాచ్‌ల తర్వాత..
టెస్టు హోదా ఉన్న జట్టుపై నేపాల్‌కు ఇదే తొలి విజయం. ఇందుకోసం నేపాల్‌కు ఏకంగా 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు అవసరం కాగా.. నేపాల్‌ చేతిలో ఓడిన తొలి ఫుల్‌ మెంబర్‌ జట్టుగా విండీస్‌ చెత్త రికార్డును మూటగట్టుకుంది.

ఇక 2022 టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా విండీస్‌.. నేపాల్‌ మాదిరే అసోసియేట్‌ జట్టు అయిన స్కాట్లాండ్‌ చేతిలో ఓడింది. 2014లో ఐర్లాండ్‌, 2016లో అఫ్గనిస్తాన్‌ చేతిలోనూ పరాజయం చవిచూసింది. అప్పటికి ఈ రెండు జట్లు అసోసియేట్‌ టీమ్‌లే కావడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement